Telangana Congress : ఇమేజ్ పెంచుకుంటున్న రేవంత్ - ఇతర కాంగ్రెస్ సీనియర్లకు నచ్చడం లేదా ?
Revanth Reddy : రేవంత్ ఇమేజ్ పెరగడం ఇతర కాంగ్రెస్ సీనియర్లకు నచ్చడం లేదు. తరచూ ఫలానా నేత త్వరలో సీఎం అవుతారని బహిరంగ ప్రకటనలు చేసి పార్టీలో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Telangana Congress Internal Politics : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఏ మాత్రం తగ్గడం లేదు. దీనికి తాజా ఉదాహరణ యాదాద్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అని సంబోధించారు. అంతే కాదు తన నాలికపై మచ్చలు ఉన్నాయని తాను చెప్పింది జరుగుతుందని కూడా అనేశారు. నిజంగా అంత నమ్మకం ఉంటే ఆయన తన సోదరుడు..మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునేవారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఓ రకమైన రాజకీయం చేశారని.. అది కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇమేజ్ పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. కానీ మాస్ లీడర్ గా ఎదిగిన రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన పదేళ్లలోపే సీఎం పదవి పొందారు. సీనియర్లను ఆయన ఎప్పుడూ తక్కువ చేయలేదు. అలాగని వారి తెర వెనుక రాజకీయాలను చూసీ చూడనట్లుగా కూడా లేరు. తన జాగ్రత్తలో తాను ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పాలనలో తనదైన ముద్ర వేస్తూ ఇమేజ్ పెంచుకుంటున్నారు. రుమమాఫీ అమలు చేయడంతో పాటు హైడ్రా విషయంలో ఆయన రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారని ఎక్కువ మంది అనుకునేలా చేసుకుంటున్నారు. ఓ రకంగా రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ సీఎంగా మారుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో వైఎస్ ..ఈ వ్యూహాన్ని అమలు చేశారు. క్రమంగా పార్టీపై పట్టు సాధించి తిరుగులేని నేత అయ్యారు. ఇప్పుడు మరో దారిలో అయినా రేవంత్ అదే పని చేస్తున్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలపై టీడీపీ పక్కా వ్యూహం - రాజీనామాలు చేసినా పదవులు వాళ్లకే !
రేవంత్ పట్టు పెంచుకోవడంపై సీనియర్లలో ఆందోళన
ఇవాళ కాకపోతే రేపైనా ముఖ్యమంత్రి పదవి తమకు వస్తుందని చాలా మంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. బయటకు రేవంత్ రెడ్డి మరో పదేళ్లు.. ఇరవై ఏళ్లు సీఎంగా ఉంటారు కానీ అంతర్గతంగా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూనే ఉంటారు. కొంత మంది సీనియర్ నేతల లక్ష్యం తాము సీఎం కాకపోయినా రేవంత్ రెడ్డిని దించడం కూడా అవుతుంది. ఎదుకంటే ఆయన పదవిలో ఉంటే మరింత పవర్ ఫుల్ అవుతారు. తర్వాత ఆయన నీడలోనే రాజకీయాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ ఇమేజ్ పెరుగుతూండటంతో హైకమాండ్ దగ్గర ఆయన పలుకుబడి పెరుగుతుందని అదే జరిగితే తమ కు అవకాశాలు రావాలని భావించి.. ఒకరి తర్వాత ఒకర్ని ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారని భావిస్తున్నారు.
ఇక ప్రజల్లోకి కేసీఆర్ - టార్గెట్ బీజేపీనా ? కాంగ్రెస్ నా ?
సీనియర్ల రాజకీయాల్ని తట్టుకుని రేవంత్ రాజకీయం
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన మొదట్లో ఆయన ఆ పార్టీలో ఇమడలేరని అనుకున్నారు. చాలా రోజుల పాటు ఆయన సైలెంట్ గా ఉన్నారు.కానీ ఆయన వేచి చూసి.. మెల్లగా వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం పొందారు. తర్వాత సీనియర్లు వ్యతిరేకించినా.. హైకమాండ్ ను మెప్పించి పీసీసీ చీఫ్ పొందారు. తర్వాత సీఎం పదవి పొందారు. అంటే ఆయన కాంగ్రెస్ రాజకీయాల్ని డీకోడ్ చేసి తనదైన రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నట్లే. అయినా సీనియర్ నేతలు మాత్రం.. కొంత మంది ఇప్పటికీ పాత తరహా రాజకీయాలుక ప్రయత్నిస్తున్నారు. రేవంత్ వ్యూహాలను అర్థం చేసుకోలేకపోతున్నారని అనుకోవచ్చు. ఇప్పుడు సీఎం మార్పుపై ఎవరు మాట్లాడినా.. ఆ కాంగ్రెస్ నేతలపై వ్యతిరేక భావం ఏర్పడుతుంది. కానీ వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.