Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే వానలు.. బంగాళాఖాతంలో అల్ప పీడనమే కారణం..
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 4 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. ఫలితంగా మధ్య బంగాళా ఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఇది తర్వాతి 48 గంటల్లో మరింత బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న 4 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం వరకు చేపట వేటకు వెళ్లరాదని.. మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ఫలితంగా ఉత్తరాంధ్రలో పలు చోట్లు భారీ వర్షాలు మిగతా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం నేపథ్యంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని ఆదేశించారు.
ఇవాళ, రేపు ఆ జిల్లాల్లో వర్షాలు..
ఉపరితల ఆవర్తన కారణంగా నేడు (శనివారం) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఉత్తర కోస్తా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మరో 5 రోజులు వానలే వానలు..
తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 15న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం, జగిత్యాల,ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.