Blast in Lahore: పాకిస్థాన్‌లో భారీ పేలుడు..ముగ్గురు మృతి, 23 మందికి తీవ్ర గాయాలు
పాకిస్థాన్‌లో భారీ పేలుడు జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
పాకిస్థాన్ లాహోర్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 23 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. లాహోర్‌లోని అనార్కలీ బజార్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు.
భారతీయ వస్తువులు విక్రయించే ప్రాంతంలోని ఓ పాన్ మండీ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మోటార్ సైకిల్‌కు పెట్టిన బాంబు పేలడం వల్లే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇది ఐఈడీ లేదా టైమ్ బాంబా అనే దానిపై స్పష్టత లేదన్నారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలోని భవనాల కిటీకీ అద్దాలు బద్దలయ్యాయి. పలు వాహనాలు కూడా పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ పేలుడుకు బాధ్యత వహించలేదు.
ఉగ్రవాద నిరోధక, బాంబు నిర్వీర్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఆసుపత్రిలో చేరిన వారిలో ఓ బాలుడు సహా మరో ఇద్దరు మృతి చెందారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఫోరెన్సిక్ విభాగం కూడా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు