Racharikam Review - రాచరికం రివ్యూ: సీఎం సీటుకు అక్క, తమ్ముడు చేసిన రక్తచరిత్ర - రాయలసీమ రాజకీయాలకు అద్దం పట్టేలా...
Racharikam Review In Telugu: అప్సరా రాణి ప్రధాన తారగా, వరుణ్ సందేశ్ విలన్ షేడ్ ఉన్న రోల్‌లో నటించిన సినిమా 'రాచరికం'. రాయలసీమలోని రాచకొండ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే?

సురేష్ లంకలపల్లి
అప్సరా రాణి, వరుణ్ సందేశ్, శివ, శ్రీకాంత్ అయ్యంగార్, ఈశ్వర్, విజయ్ రామరాజు
అప్సరా రాణి (Apsara Rani) మీద గ్లామరస్ లేడీ ఇమేజ్ పడింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోని సినిమాల్లో ఆవిడ చేసిన క్యారెక్టర్లు అటువంటివి. స్కిన్ షోకి చాలా దూరంగా ఆవిడ నటించిన సినిమా 'రాచరికం'. ఇందులో వరుణ్ సందేశ్ విలన్ షేడ్ ఉన్న రోల్ చేశారు. విజయ్ శంకర్ హీరో. సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది? రాయలసీమ నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో ఏం చూపించారు? అంటే...
కథ (Racharikam Movie Story): రాయలసీమలోని రాచకొండలో రాజారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతాడు. సాధారణ ఎమ్మెల్యేగా తన ప్రయాణం ప్రారంభించిన అతను... పాతికేళ్లలో ముఖ్యమంత్రి సీటుకు బలమైన అభ్యర్థిగా ఎదుగుతాడు. రాచకొండ నియోజకవర్గంలో ఎన్నికలు లేకుండా ప్రతిసారి తన ఏకఛత్రాధిపత్యం చూపిస్తాడు.
రాజారెడ్డి కుటుంబం విషయానికి వస్తే... వారసుడు కావాలని అమ్మాయి పుట్టిన ప్రతిసారి పురిటిలో చంపేస్తాడు. అయితే... భార్గవి (అప్సరా రాణి) మాత్రం దేవుడి దయతో బతుకుతుంది. ఆమె తర్వాత వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) జన్మిస్తాడు. శివ (విజయ్ శంకర్)తో కూతురు ప్రేమలో పడిందని తెలిసి తన రాజకీయ అవసరాల కోసం రాక్షసుడి లాంటి బైరెడ్డి (విజయ్ రామరాజు)కి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
బైరెడ్డి మీద మొదలైన వరుస ఎటాక్స్ నుంచి ముఖ్యమంత్రి కావాలనే రాజారెడ్డి కలలను అడ్డుకున్నది ఎవరు? సీఎం సీటు కోసం అక్క భార్గవి, తమ్ముడు వివేక్ రెడ్డి మధ్య ఎటువంటి యుద్ధం జరిగింది? అప్పుడు తండ్రి ఏం చేశాడు? రాయలసీమ మార్క్ రాజకీయాల్లో ఎంత మంది మరణించారు? రక్తం ఏరులై ఎలా పారింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Racharikam Review Telugu): రాయలసీమ రక్త రాజకీయాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు అన్నిటిలో 'అరవింద సమేత వీర రాఘవ' కాస్త భిన్నంగా ఉంటుంది. 'మనకు పాలు ఇచ్చి పెంచిన తల్లులు మనల్ని పాలించలేరా?' అంటూ మహిళలు ఎందులోనూ తక్కువ కాదనే సందేశాన్ని ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో చేత త్రివిక్రమ్ చెప్పించారు. రాచరికం సినిమాలోనూ అటువంటి సందేశాన్ని ఇచ్చారు. అయితే... మరి రా అండ్ రస్టిక్ ఫిల్మ్ ఇది.
'రాచరికం' చిత్రానికి సురేష్ లంకలపల్లి రచయిత దర్శకుడు. ఆయన ఎంపిక చేసుకున్న పాయింట్ బావుంది. అయితే, ఆ పాయింట్ చెప్పడానికి రాసుకున్న సన్నివేశాల్లో కొత్తదనం లోపించింది. ఎన్నో సినిమాల్లో చూసిన నక్సలిజం, ఫ్యాక్షనిజం, మహిళల్ని లైంగిక అవసరాల కోసం వాడుకునే కామాంధుల నైజం వంటివి మరోసారి తెరపై చూపించారు. రొటీన్ సీన్స్ ఉన్నాయి. అమ్మాయి కేవలం సుఖం అందించడానికి మాత్రమే అనుకునే భర్త, ఆడపిల్లలు వద్దనుకునే తండ్రి, కుల వివక్ష... వీటన్నిటినీ ఒక ప్యాకేజీలో కమర్షియల్ రా అండ్ రస్టిక్ సినిమాగా చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఒక దశలో ప్రధాన పాత్రలను ఎంత బలవంతులుగా చూపించారో, ఆ తర్వాత ఆ స్థాయిలో ముందుకు తీసుకు వెళ్ళలేదు. అప్సరా రాణి ప్రేమ కథ, ఆ కుల వివక్షను కొత్తగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది.
పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు చేయలేనిది అంటూ ఏదీ లేదని ఇచ్చిన సందేశం బావుంది. అయితే... మహిళల మీద రాసిన కొన్ని డైలాగులు శృతి మించాయి. కథనం పరంగా కొత్తదనం లేదు. కానీ, నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పవచ్చు. కానీ, కొంతలో కొంత ఆ జరిగేది ఆసక్తిగా చూసేలా తీశారు. కెమెరా వర్క్ బావుంది. రా అండ్ రస్టిక్ ఫీల్ రావడంలో సక్సెస్ అయ్యారు. కలర్ గ్రేడింగ్ బావుంది. వెంగీ పాటల్లో కొత్తదనం లేదు. మెలోడీలు కొన్ని బావున్నాయి. నేపథ్య సంగీతంలో మరింత ఇంటెన్స్ అవసరం. ఎలివేట్ చేయాల్సిన చోట అనుకున్న స్థాయిలో ఆర్ఆర్ లేదు. ఈశ్వర్ నిర్మాణ విలువలు బావున్నాయి. కథకు తగ్గట్టు రాజీ పడకుండా ఖర్చు చేశారు. యాక్షన్ సన్నివేశాలు చూస్తే చిన్న సినిమా అన్నట్టు ఉండదు.
'రాచరికం' సినిమా అప్సరా రాణికి కెరీర్ టర్నింగ్ అని చెప్పవచ్చు. ఆమె కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదని, ఆమెలో నటి కూడా ఉందని కొన్ని సన్నివేశాలు చెప్పాయి. అమ్మవారిగా చూపించే సీన్ బావుంది. వరుణ్ సందేశ్ విలనిజం చూపించారు. వాయిస్ మాడ్యులేషన్ బావుంది. కానీ, ఆ పెట్టుడు మీసం అసలు సెట్ కాలేదు. శివ, ఈశ్వర్ తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. బైరెడ్డి రోల్ చేసిన విజయ్ రామరాజును చూస్తే నిజంగా రాక్షసుడు అన్నట్టు కనిపించారు. 'వీడు చస్తే బావుండు' అని ప్రేక్షకులు ఫీలయ్యేలా నటించారు. ఆయన లుక్, యాక్టింగ్ చూస్తే పెద్ద సినిమాల్లో విలన్ రోల్స్ కోసం ట్రై చేయవచ్చు. శ్రీకాంత్ అయ్యంగార్ తన రెగ్యులర్ డైలాగ్ డెలివరీ, నటనతో తండ్రి పాత్ర చేశారు.
'రాచరికం' సినిమాలో తండ్రి పేరు రాజారెడ్డి కావడం... ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య జరిగిన యుద్ధం... రాయలసీమలో బలమైన నేపథ్యం ఉన్న కుటుంబానికి దగ్గర దగ్గరగా ఉన్నవే. కథ, కథనం ఊహించేలా ఉన్నప్పటికీ... రా అండ్ రస్టిక్ ఫిల్మ్ కావడంతో స్క్రీన్ మీద సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. నటుడిగా వరుణ్ సందేశ్, నటిగా అప్సరా రాణికి కొత్త రూట్ వేసిన సినిమా. ఇదొక డీసెంట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. రాజకీయ నేపథ్యంలో సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను శాటిస్‌ఫై చేస్తుందంతే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

