Hair Fall : జుట్టు రాలిపోతుందా? ఈ ఆహారాలు తింటున్నారేమో... చెక్ చేసుకోండి
జుట్టు ఎదుగుదలకు మంచి ఆహారమే కారణం, అలాగే జుట్టు రాలిపోవడానికి కూడా అనారోగ్యకరమైన ఆహారమే కారణం అంటున్నారు నిపుణులు.
మీరు తినే ఆహారమే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని అందరికీ తెలిసిందే. మీరు తినే ఆహారమే జుట్టు ఎదుగుదలను కూడా నిర్ణయిస్తుంది. అలాగే జుట్టు ఊడిపోవడానికి ఒత్తిడి, వారసత్వం ఎంత కారణమో అనారోగ్యకరమైన ఆహారాలు తినడం కూడా కారకమే. కాబట్టి కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టడం ద్వారా జుట్టు రాలడాన్ని అడ్డుకోవచ్చు.
పచ్చి కోడిగుడ్లను తినే అలవాటు చాలా మందికి ఉంది. కానీ కొందరిలో అది జుట్టురాలడానికి కారణమవుతుంది. ఎలా అంటే జుట్టు ఎదుగుదలకు కెరోటిన్ అవసరం. శరీరంలో కెరోటిన్ ఉత్పత్తి అవ్వాలంటే బయోటిన్ అనే పోషక పదార్థం అవసరం. పచ్చి కోడిగుడ్డు తినేవారిలో బయోటిన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల కెరోటిన్ లోపం కూడా ఏర్పడి జుట్టు విపరీతంగా రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీకు అధికంగా జుట్టు రాలుతుంటే పచ్చి కోడిగుడ్లను తినడం మానేయాలి. ఉడకబెట్టినవి, వండినవే తినాలి.
తీపి పదార్థాలు శరీరాన్నే కాదు, జుట్టును కూడా గుల్ల చేస్తాయి. శరీరంలో చక్కెర అధికంగా చేరితే ఇన్సులిన్ నిరోధకత పెరిగిపోతుంది. దీని వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. అందుకే డయాబెటిస్‌తో బాధపడే వారిలో జుట్టు రాలిపోతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారైనా, లేని వారైనా తీపి పదార్థాలు తినడం చాలా తగ్గించుకోవాలి. అలాగే గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ తక్కవగా ఉన్న ఆహారాలనే ఎంపిక చేసుకోవాలి. ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటే జుట్టు రాలిపోవడం ఖాయం. మైదాతో చేసిన వంటకాలు కూడా తినకూడదు.
ఈ పానీయాలూ కారణమే...
ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా జుట్టు రాలిపోవడం పెరుగుతుంది. ఆల్కహాల్ కెరాటిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. పోషణ అందకపోతే వెంట్రుకలు రాలిపోతాయి. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ వంటి శీతల పానీయాలు కూడా జుట్టు రాలేందుకు కారణమవుతాయి. వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది. జంక్ ఫుడ్ వల్ల కూడా జుట్టు పోషణ అందదు.
జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఈ ఆహారపదార్థాలన్నింటినీ దూరంగా పెడితే తిరిగి ఆరోగ్యంగా జుట్టు పెరిగే అవకాశం అధికం.