Siddharth Anand: ‘టైగర్ vs పఠాన్’ యూనివర్స్‌లోకి ‘వార్’ దర్శకుడు, షారుఖ్ - సల్మాన్ ఖాన్‌లతో భారీ మూవీ?
బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ అలాంటి స్పై యూనివర్స్ ను క్రియేట్ చేసింది. 2012 లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’ తో ఈ యూనివర్స్ మొదలైంది.
Siddharth Anand: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం యూనివర్స్ సినిమాల హవా నడుస్తోంది. ఓ వైపు దేశంలోని అన్ని భాషల సినిమా పరిశ్రమలు పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పెడుతుంటే మరోవైపు యూనివర్స్ సినిమాలకు కూడా డిమాండ్ అలాగే పెరుగుతుంది. అందులోనూ స్పై యూనివర్స్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఎగబడి చూసేస్తారు. బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ అలాంటి స్పై యూనివర్స్ ను క్రియేట్ చేసింది. 2012లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’తో ఈ యూనివర్స్ మొదలైంది. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత స్పై యూనివర్స్ ను క్రియేట్ అయింది. మళ్లీ ఐదేళ్ల తర్వాత 2017లో ‘టైగర్ జిందా హై’ సినిమాతో ఈ స్పై యూనివర్స్ ను కొనసాగించారు. ఈ సినిమాకు అలీ అబ్బాస్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాల తర్వాత ఇప్పుడు ఈ స్పై యూనివర్స్ లోకి దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఎంట్రీ ఇచ్చారు. సిద్దార్థ్ రావడంతో ఈ స్పై యూనిర్స్ ను మరింత వేగవంతం చేశారు. ఆయన 2019 లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘వార్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సిద్దార్థ్ దర్శకత్వంలో షారుఖ్ ప్రధాన పాత్రలో ‘పఠాన్’ సినిమా ను తెరకెక్కించారు. ఈ సినిమా బాలీవుడ్ లో సంచలన విజయాన్ని అందుకుంది. షారుఖ్ ఖాన్ కు దాదాపు నాలుగైదేళ్ల తర్వాత ఓ బ్లాక్ బస్టర కమ్ బ్యాక్ ను అందించారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామీను సృష్టించింది. ఈ సినిమాలో టైగర్ సిరీస్ లోని సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ ను పరిచయం చేసి యూనివర్స్ ను క్రియేట్ చేశారు. ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ వరుసగా ఈ స్పై యూనివర్స్ సినిమాలను ప్రకటించింది. అందులో ‘టైగర్ 3’, ‘వార్ 2’ ‘టైగర్ v/s పఠాన్’ సినిమాలు ఉన్నాయి.
తాజాగా ‘టైగర్ v/s పఠాన్’ సినిమా గురించి బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ కొన్ని నిమిషాలు పాటు కనిపించారు. ఇక ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ఒకరితో ఒకరు తలపడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ నిర్మాణ సంస్థ ఆదిత్య చోప్రా సిద్దార్థ్ కు ఒక పెద్ద యాక్షన్ సీన్ ను తెరకెక్కించే బాధ్యతను అప్పగించారట. అది ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశమే అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. బాలీవుడ్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు సిద్దార్థ్ అయితేనే బాగా చేయగలడని మూవీ నిర్మాణ సంస్థ భావించడంతో ఈ చిత్రానికి సిద్దార్థ్ ను ఎంపిక చేశారని టాక్. 2024 లో సినిమా మొదలవుతుందని సమాచారం. మరి ‘టైగర్ v/s పఠాన్’ సినిమా బాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Read Also: రావణాసుర To శాకుంతలం, ఏప్రిల్ లో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!