Ayodhya Ram Mandir: నయా నరేంద్ర మోడీ బయోపిక్ - అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా!
Narendra Modi Biopic Latest: నరేంద్ర మోడీ జీవితంపై మరో సినిమా రానుంది. నయా బయోపిక్‌లో అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కూడా ఉండనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
జై శ్రీరామ్ నామస్మరణతో సోమవారం యావత్ భారతావని పులకించింది. అయోధ్య నగరిలో మర్యాదా పురుషోత్తముడు శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠ (Ayodhya Ram Mandir) మహోత్సవాన్ని చూసి అశేష భారతావని భక్తి పారవశ్యంలో మునిగింది. భారతీయుల 500 ఏళ్ల కళను దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తీర్చారని పలువురు కొనియాడుతున్నారు. ఈ తరుణంలో ఆయన జీవితంపై బయోపిక్ అనౌన్స్ చేశారు తెలుగు దర్శక, నిర్మాతలు. ఆ జీవిత చిత్రంలో అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం కూడా ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వంలో 'విశ్వ నేత'
Narendra Modi Biopic VishwaNetha: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండు పర్యాయాలు పదవి బాధ్యతలు చేపట్టారు. ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. 'మూడోసారి ఆయన ప్రధానిగా ఎన్నిక కావడం, మన దేశ పాలన పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం' అని మోడీ అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవం ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాముని ప్రాణ ప్రతిష్ఠతో సహా మోడీ అధికారంలో వచ్చిన తర్వాత చేసిన కీలక ఘట్టాలపై ఓ బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు సిహెచ్ క్రాంతి కుమార్.
Also Read: హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
యువ ప్రతిభాశాలి సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ 'విశ్వ నేత'. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మాత్రమే కాకుండా అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ సినిమాలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య తారాగణం. వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇంతకు ముందు నరేంద్ర మోడీ జీవితంపై ఓ సినిమా వచ్చింది. సర్జికల్ స్ట్రైక్ వంటి సినిమాల్లో ఆయన ప్రస్తావన ఉంది. అయితే... అయోధ్య రామ మందిరం ఎందులోనూ లేదు. ఆ నేపథ్యంలో వచ్చిన తొలి మోడీ బయోపిక్ 'విశ్వ నేత' అని చెప్పవచ్చు.
కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతంలో...
'విశ్వ నేత' చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇంకా వాళ్లు మాట్లాడుతూ ''ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జిఎస్టీ, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలనాలు 'విశ్వ నేత'లో ఉంటాయి. కోట్లాది మంది భారతీయుల గుండెల్లో కొలువుదీరి... యూనిఫాం సివిల్ కోడ్ అమలు దిశగా అడుగులు వేస్తున్న నరేంద్రుడి జీవిత సినిమాలో ఛాయ్ వాలా నుంచి విశ్వ నేతగా ఎదిగిన ఆయన మహాప్రస్థానాన్ని చూపించబోతున్నాం'' అని చెప్పారు.
Also Read: టు మినిట్స్ కూడా లేవుగా - వైరల్ అవుతున్న ప్రభాస్ 'సలార్' డైలాగ్స్