Kantara in Telugu : తెలుగులో 'కాంతారా' - అల్లు అరవింద్ చేతిలో 'కెజియఫ్' నిర్మాత సినిమా
'కెజియఫ్ 2' తీసిన హోంబలే సంస్థ నిర్మించిన సినిమా 'కాంతారా'. సెప్టెంబర్ 30న కన్నడ వెర్షన్ విడుదలైంది. ఈ వారమే తెలుగు వెర్షన్ విడుదల కానుంది. దీనిని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తోంది.
కన్నడ సినిమా 'కాంతారా' (Kantara Movie) సెప్టెంబర్ 30న విడుదలైంది. కన్నడ ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు... సినిమా చూసిన ఇతర భాషల ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ వారమే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
Kantara Telugu Release : 'కాంతారా' అనేది సంస్కృత పదం! అంటే... అడవి అని అర్థం! అడవి తల్లిపై మనం ఎంత ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను... ఎంత విధ్వంసం సృష్టిస్తే... అంతకు మించి ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అనే కథాంశంతో 'కాంతారా' సినిమా రూపొందింది. ప్రేమ, భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించారనే ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తెలియజేసింది.
హీరో... దర్శకుడు... ఒక్కరే!
'కాంతారా' సినిమాలో రిషబ్ శెట్టి (Rishab Shetty) కథానాయకుడు. అంతే కాదు... ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు కూడా! అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. 'కెజియఫ్' రెండు భాగాలతో దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించిన చిత్రమిది. కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదల అయ్యింది. తెలుగు వెర్షన్ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
Kantara Telugu Trailer : 'కాంతారా' ట్రైలర్ చూస్తే... అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలు. కట్టుబాట్లు, సంప్రదాయాలు పాటిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ వల్ల వాళ్లకు ఇబ్బందులు ఎదురు అవుతాయి. హీరోను, ఇతరులను అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? హీరో ప్రేమ కథ ఏంటి? అనేది సినిమాగా తెలుస్తోంది. విజువల్స్ చాలా బావున్నాయి. పల్లె, అడవి వాతావరణాన్ని చక్కగా తెరకెక్కించారు. సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్ రీ రికార్డింగ్ సినిమాను ఎలివేట్ చేసేలా ఉంది.
రిషబ్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు కొత్త గానీ... కిశోర్ కుమార్ తెలుగులో చాలా సినిమాలు చేశారు. 'ఛలో' సినిమాలో అచ్యుత్ కుమార్ కనిపించారు. సినిమా బావుంటే... భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. సో, ఈ సినిమాకు మంచి పేరు వచ్చే అవకాశాలు ఎక్కువ.
Also Read : మార్వెల్ రేంజ్‌లో 'ఆదిపురుష్' - టీజర్ చూసి సినిమాను గెస్ చేయలేరు: ఓంరౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రిషబ్ శెట్టి, కిశోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్ కశ్యప్, కూర్పు : ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్, సంగీతం - అజనీష్ లోకనాథ్, తెలుగులో పంపిణీ - గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, నిర్మాత: విజయ్ కిరగందూర్, దర్శకత్వం : రిషబ్ శెట్టి.