Exposed Web Series Review - ఎక్స్‌పోజ్డ్ వెబ్ సిరీస్ రివ్యూ : న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ
OTT Review - Exposed Telugu Web Series : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన వెబ్ సిరీస్ కావడంతో 'ఎక్స్‌పోజ్డ్'పై ఆడియన్స్ చూపు పడింది. 80 ఎపిసోడ్స్ గల సిరీస్‌లో ఐదు విడుదలయ్యాయి.
విజయ్ కృష్ణ
చెన్నమనేని వాసుదేవరావు, హర్షిత, శిరీషా నూలు తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ: ఎక్స్‌పోజ్డ్
రేటింగ్: 2/5
నటీనటులు: చెన్నమనేని వాసుదేవరావు, హర్షిత, శిరీషా నూలు, ఆర్జే కాజల్, కరుణ భూషణ్, అవన్ స్కైస్, భావన, మేఘన ఖుషి తదితరులు
సినిమాటోగ్రఫీ: సుభాష్ దొంతి
సంగీతం: ఎం. సాయి మధుకర్
రచన : అనురాధ గౌతమ్ కశ్యప్
క్రియేటర్ : కోడా కమ్యూనికేషన్
నిర్మాత: ఆర్.కె. టెలీషో
సమర్పణ : కె. రాఘవేంద్రరావు
దర్శకత్వం: విజయ్ కృష్ణ
విడుదల తేదీ: అక్టోబర్ 6, 2022
ఎపిసోడ్స్ : ఐదు (ఇప్పటి వరకు విడుదలైనవి)
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో రీసెంట్‌గా విడుదలైన వెబ్ సిరీస్ 'ఎక్స్‌పోజ్డ్' (Exposed Web Series). దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందింది. మొత్తం 80 ఎపిసోడ్స్ గల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఐదు విడుదల అయ్యాయి. ప్రతి గురువారం ఐదు చొప్పున విడుదల కానున్నాయి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోంది? మొదటి ఐదు ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి?
కథ (Exposed Web Series Story) : గ్రీష్మ (హర్షిత), ఆకాష్ (చెన్నమనేని వాసుదేవరావు) భార్య భర్తలు. అంతే కాదు... ఎక్స్‌పోజ్డ్ 24 ఛానల్‌లో న్యూస్ ప్రజెంటర్స్. 'ఫేస్ ఆఫ్ ది ఛానల్ నువ్వే', 'టీఆర్పీకి కారణం నువ్వే' అంటూ గ్రీష్మను సీఈవో, చీఫ్ ఎడిటర్ సహా అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఆ సమయంలో ఎక్స్‌పోజ్డ్ 24 ఛానల్‌లో యాంకర్‌గా కొత్త అమ్మాయి వర్ష (శిరీషా నూలు) జాయిన్ అవుతుంది. ఆమె వచ్చిన తర్వాత వార్తలు చదివే గ్రీష్మపై వార్తలు వస్తాయి. ఆఫీసులో విషయాలు గాసిప్ ఛానల్స్‌కు వెళతాయి. ఇక్కడి వార్తలు అక్కడికి చేరవేసేది ఎవరు? స్విమ్మింగ్ ఫూల్‌లో గ్రీష్మ ఎందుకు విగత జీవిగా పడి ఉంది? ఆమె మరణానికి కారణం ఎవరు? పైకి చాలా అమాయకంగా కనిపించే వర్ష జీవిత నేపథ్యం ఏమిటి? అనే విషయాలు సిరీస్ చూస్తే తెలుస్తాయి.
విశ్లేషణ (Exposed Review) : మీడియా, ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ నేపథ్యంలో తెలుగులో తక్కువ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. టీవీ స్క్రీన్ వెనుక జరిగే వ్యవహారాలను వెలుగులోకి తీసుకు వచ్చాయి. 'ఎక్స్‌పోజ్డ్'లో కథ, కథనాలు అందుకు భిన్నంగా ఏమీ లేవు. ఇప్పటి వరకు విడుదలైనవి ఐదు ఎపిసోడ్స్ మాత్రమే కనుక... వీటిని చూసి ఒక అంచనాకు రావడం కూడా కరెక్ట్ కాదు.
ఐదు ఎపిసోడ్స్‌లో ఎవరి క్యారెక్టర్ ఏమిటి? అనేది ఎస్టాబ్లిష్ చేశారు. గ్రీష్మపై పగ తీర్చుకోవడానికి ఛానల్‌లో వర్ష అడుగు పెట్టిందనే విషయాన్ని చెప్పేశారు. గ్రీష్మ మరణించినట్లు చూపించారు. భార్య ఎదుగుదలతో తన గుర్తింపు కోల్పోతున్నట్లు భర్త ఫీలవుతున్నట్లు చూపించారు. అయితే... గ్రీష్మ మరణానికి కారణం ఎవరు? వర్ష తండ్రి చావుకు గ్రీష్మ ఎలా కారణం అయ్యింది? వంటి విషయాలను సస్పెన్స్‌లో ఉంచారు. 'బిగ్ బాస్' ఫేమ్ జస్వంత్ జెస్సి (Bigg Boss Jaswanth Jessie) పాత్ర రాబోయే ఎపిసోడ్స్‌లో ఎలా ఉంటుందో చూడాలి.
దర్శకుడు విజయ్ కృష్ణ మంచి థ్రిల్లర్‌కు అవసరమైన సెటప్ చేశారు. అయితే, మీడియా అంటే సెక్యువల్ అఫైర్స్ అన్నట్టు కొన్ని క్యారెక్టర్లు డిజైన్ చేయడం అసలు బాలేదు. దీని తర్వాత ఏం చేస్తారనేది చూడాలి. మిగతా ఎపిసోడ్స్‌పై వెబ్ సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. వాటిని ఎంత ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకు వెళితే అంత సక్సెస్ అవుతుంది. వెబ్ సిరీస్ కనుక పరిమిత నిర్మాణ వ్యయంలో తీసినట్లు ఉన్నారు. టెక్నికల్ అవుట్‌పుట్ కూడా ఆ విధంగా ఉంది.
నటీనటులు ఎలా చేశారు? : చెన్నమనేని వాసుదేవరావు, హర్షిత, శిరీషా నూలు, ఆర్జే కాజల్, కరుణ భూషణ్, అవన్ స్కైస్... అందరూ సన్నివేశాలకు తగ్గట్లు నటించారు. ఏదో చేసుకుంటూ వెళ్ళారు తప్ప... గొప్పగా ఎవరూ చేయలేదు. అటువంటి అవకాశం కూడా రాలేదు. చెన్నమనేని వాసుదేవరావు గతంలో సీరియల్స్ చేశారు. రాబోయే ఎపిసోడ్స్‌లో ఆ యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ కనిపిస్తుందేమో చూడాలి. న్యూస్ ప్రజెంటర్‌గా హర్షిత నటన సహజంగా ఉంది. చీఫ్ ఎడిటర్ పాత్రలో ఆర్జే కాజల్ చక్కగా చేశారు.
Also Read : 'గుడ్ బై' రివ్యూ : రష్మిక ఫస్ట్ హిందీ సినిమా ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'ఎక్స్‌పోజ్డ్' తొలి ఐదు ఎపిసోడ్స్‌లో క్యారెక్టర్స్‌ను ఎక్స్‌పోజ్ చేశారు. కథపై కొంచెం అంటే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారంతే! 80 ఎపిసోడ్స్ కనుక సీరియల్‌లా ఉంది. మెజారిటీ ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు లేకపోవడం సిరీస్‌కు మైనస్. ఇక నుంచి ప్రతి గురువారం రాబోయే కొత్త ఎపిసోడ్స్ చూసే ఉద్దేశం ఉంటే ఒకసారి ఈ ఐదూ చూసే ప్రయత్నం చేయండి.
Also Read : ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?