Vennela Kishore: 'చారి 111' ప్రెస్‌మీట్‌కి 'వెన్నెల' కిశోర్ అందుకే రాలేదు!
Chaari 111 movie: వెన్నెల కిశోర్ హీరోగా నటించిన 'చారి 111' మార్చి 1న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కి వెన్నెల కిశోర్ రాలేదు.
Vennela Kishore's Chaari 111 movie: టాలీవుడ్ టాప్ కమెడియన్లలో 'వెన్నెల' కిశోర్ ఒకరు. ఆయన కమెడియన్ మాత్రమే కాదు... మంచి నటుడు. ఎటువంటి సన్నివేశంలో అయినా అద్భుతంగా నటించగలరు. మార్చి 1న ఆయన హీరోగా థియేటర్లలోకి వస్తున్నారు. 'చారి 111' సినిమాతో 'చారి... బ్రహ్మచారి' అంటూ గూఢచారిగా తెలుగు ప్రేక్షకుల్ని నవ్వించడానికి రెడీ అవుతున్నారు. శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించగా... 'వెన్నెల' కిశోర్ రాలేదు. ఆయన ఎందుకు రాలేదో దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ చెప్పారు.
'వెన్నెల' కిశోర్ అందుకే రాలేదు!
'చారి 111' చిత్రానికి 'మళ్ళీ మొదలైంది' ఫేమ్ టీజీ కీర్తీ కుమార్ దర్శకుడు. ఆయన మాట్లాడుతూ... ''నేను 'చారి 111' కంటే ముందు తీసిన సినిమాలో వెన్నెల కిశోర్ గారు కమెడియన్ రోల్ చేశారు. నేను ఆయనకు అభిమాని. ఆయన్ను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ ఫిల్మ్స్ 'పింక్ పాంథర్', 'జానీ ఇంగ్లీష్' స్ఫూర్తితో స్పై యాక్షన్ జానర్ కామెడీ స్క్రిప్ట్ రాశా. కిశోర్ గారికి నచ్చడంతో వెంటనే స్టార్ట్ చేశా. తొలుత మేం 'చారి 111'ను మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశాం. వరుసగా ఈవెంట్స్ కూడా చేయాలనుకున్నాం. అయితే... మార్చి 1కి షిఫ్ట్ చేశాం. అందరికీ తెలుసు... 'వెన్నెల' కిశోర్ గారు బిజీ ఆర్టిస్ట్. షూటింగ్స్ ఉండటంతో ఇవాళ రాలేకపోయారు'' అని చెప్పారు.
'వెన్నెల' కిశోర్ ప్రెస్‌మీట్‌కి రాలేదు. కానీ, సినిమాను ప్రమోట్ చేయడానికి తన టైం కేటాయిస్తున్నారు. యాంకర్ సుమ కనకాలతో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ సంయుక్తా విశ్వనాథన్, దర్శకుడు కీర్తీ కుమార్, ఆయన కలిసి మరో వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు.
Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు
బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ 'చారి 111' చిత్రాన్ని నిర్మించారు. ఆమె గురించి దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ... ''అదితి గారు తెలుగులో వరుస సినిమాలు నిర్మించాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆమె నుంచి కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ వస్తాయి. ఇటువంటి సినిమా తీశానంటే కారణం ఆమె. ఎంతో సపోర్ట్ చేశారు'' అని చెప్పారు. తాను రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి అభిమాని అని, 'మళ్ళీ మొదలైంది'లో ఆయనతో సాంగ్స్ రాయించుకోవడం కుదరలేదని, ఈ సినిమాలో థీమ్ సాంగ్ ఆయనతో రాయించానని, అది బాగా వచ్చిందని చెప్పారు.
'చారి 111' ఫన్ ఫిల్మ్... అందరూ ఎంజాయ్ చేస్తారు! - అదితి సోనీ
నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ... ''నిర్మాతగా నా ఫస్ట్ ఫిల్మ్ 'చారి 111'. సంథింగ్ డిఫరెంట్, కొత్తగా ప్రయత్నించాం. ఫెంటాస్టిక్ టీం కుదిరింది. 'వెన్నెల' కిశోర్ గారు అంటే మాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అనేది మాటల్లో చెప్పలేను. ఆయనతో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మార్చి 1న ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ఇదొక మంచి ఫన్ ఫిల్మ్. ఎంజాయ్ చేస్తారు'' అని చెప్పారు.
Also Read: థియేటర్లలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలుగు సినిమాలు ఇవే!
'చారి 111' సినిమాలో పాట రాయడానికి మూడు నెలల సమయం తీసుకున్నాని, ఆ పాట బాగా రావడం కోసం కృషి చేశానని రామజోగయ్య శాస్త్రి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్తా విశ్వనాథన్, సంగీత దర్శకుడు సైమన్ కె కింగ్ పాల్గొన్నారు.