Ram Charan: గ్లోబల్ స్టార్ గోల్డెన్ హార్ట్, చిన్నారి గుండెకు ప్రాణం పోసిన రామ్ చరణ్
Ram Charan Helps Journalist daughter | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన మంచి మనసును చాటుకున్నారు. గుండె సమస్యతో బాధపడుతున్న ఓ పాప చికిత్సకు ఆయన సాయం అందించారు.
Ram Charan Telugu News | మెగాస్టార్ చిరంజీవి నటనలోనే కాదు సాయంలో కూడా ముందుండే మంచి మనసు ఉన్న మనిషి. అయితే ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, నటనలోనూ, సాయంలోనూ చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. తాజాగా ఆయన ఓ చిన్నారి పాపకు ప్రాణదాతగా నిలిచి, అందరి దృష్టిని ఆకర్షించారు.
అసలేం జరిగిందంటే...
టాలీవుడ్లో మంచి నటుడిగా, సాయంలో ముందుండే వ్యక్తిగా మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు ఉంది. ఇక రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ స్టార్ గా ఎదిగి ఆయన వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓవైపు సినిమాలు మరోవైపు సేవా కార్యక్రమాలతో చెర్రీ దూసుకెళ్తున్నాడు. తాజాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారి పాప పాలిట ప్రాణదాతగా నిలిచి అందరి మన్ననలు అందుకుంటున్నారు.
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మెగా అభిమానులకు పండగ లాంటి అదే రోజు ఒక ఫోటో జర్నలిస్టు కుటుంబంలో మహాలక్ష్మి జన్మించింది. కానీ ఆ పాపకి హార్ట్ ఇష్యూ (పల్మనరీ హైపర్ టెన్షన్) అనే సమస్య ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా పాప బ్రతికే ఛాన్స్ తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో చికిత్స కోసం పాపని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఈ చికిత్సకి లక్షలు ఖర్చు అవుతుందనే విషయం తెలిసింది. కానీ సదరు జర్నలిస్టుకి అంత భారీ బడ్జెట్ తో కూతురికి చికిత్స చేసే స్థోమత లేకపోవడంతో విషయం రామ్ చరణ్ దృష్టికి వెళ్ళింది. పాప ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న చరణ్ ఆ చిన్నారికి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకున్నారు.
Kudos to Global star @AlwaysRamCharan garu 🤗 ❤️
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) October 16, 2024
On August 22, a baby girl was born with a serious heart condition (Pulmonary Hypertension), and her family couldn't afford treatment. Global Star #RamCharan garu stepped in to ensure she received the care she needed. He inquired… pic.twitter.com/GyzNt6wRIB
ఆగస్టు 24న ఆ పాపను హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా ఎప్పటికప్పుడు పాప ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ కావాల్సిన సాయం అందిస్తూ వచ్చారు. మరోవైపు ఆ పాపకు అవసరమైన బ్లడ్, ప్లేట్లెట్స్ వంటివి చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ అందించింది. ఎట్టకేలకు 53 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 16న ఆ చిన్నారి పాప పూర్తిగా కోలుకోవడంతో ఆ జర్నలిస్ట్ ఇంట సంతోషం వెళ్లి విరిసింది. ఇలా నటనలోనే కాదు మంచి మనసులోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇక ఆయన గోల్డెన్ హార్ట్ తో చేసిన ఈ పని గురించి తెలిసిన వారు రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా 'గేమ్ ఛేంజర్'
కాగా ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా, సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతోంది. మరోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.