(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss 6 Telugu Episode 09: నామినేషన్లో ఆ ఎనిమిది మంది, ఎక్స్‌ట్రాలు వద్దంటూ గీతూపై రేవంత్ ఫైర్, బిగ్‌బాస్ నిర్ణయాన్నే నామినేట్ చేసిన ఆది
Bigg Boss 6 Telugu: నామినేషన్లు వాడి వేడిగా సాగాయి. ఈ వారంలో ఎనిమిది మంది నామినేషన్లో నిలిచారు.
Bigg Boss 6 Telugu: రెండో వారం నామినేషన్లు ఒక్కొక్కరిలో దాగున్న ఫైర్ ని బయటికి తీశాయి. చివరికి ఇప్పటివరకు పెద్దగా మాట్లాడని రాజశేఖర్ కూడా ఈ రోజు నామినేషన్లలో మాట్లాడాడు. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే రేవంత్, అర్జున్ గురించి శ్రీసత్యకు, శ్రీహాన్ కు చెబుతూ కనిపించాడు. అప్పుడు పక్కన అర్జున్ కూడా ఉన్నాడు. ఈలోపు ఇనయా తన మైక్ గురించి వెతకడం మొదలుపెట్టింది. ఎవరినీ అడిగినా లేదన్నారు. దీంతో బిగ్ బాస్ కు కంప్లయింట్ చేసింది ఇనయా. ‘నేను స్నానం చేసి వచ్చేసరికి తన మైక్ పోయిందని, ఎక్కుడుందో వెతికి పెట్టండి’ అని కోరింది. అందరి దగ్గరికి వెళ్లి అడిగేసరికి ఆర్జే సూర్య తన మెడలో ఉన్న మైక్ తీసి ఇచ్చాడు. నిజానికి సూర్య మైక్ ను శ్రీహాన్, ఆరోహి దాచేశారు. దీంతో సూర్య, ఇనయా మైక్ వేసుకున్నారు.
నామినేషన్ స్టార్ట్
కుండ బద్దలు కొట్టే నామినేషన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోను కుండపై అతికించి పక్కనున్న నూతిలో వేసి పగులగొట్టాలి. బాలాదిత్య ఈ వారం ఇంటి కెప్టెన్ కావడంతో అతడిని ఎవరూ నామినేట్ చేయకూడదని చెప్పారు బిగ్ బాస్. మొదటగా ఆరోహి నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది. ఆదిరెడ్డిని ఆమె నామినేట్ చేసింది. తనతో ఆయన పెద్దగా మాట్లాడలేదని, పెద్దగా బంధం ఏర్పడలేదని అందుకే నామినేట్ చేసినట్టు చెప్పింది. దానికి ఆదిరెడ్డి మీరు ప్రతి దానికి విసుగ్గా ముఖం పెడుతున్నావని అందుకే మాట్లాడలేదని చెప్పాడు.
మగాళ్లకు బుద్ధి లేదా?
శ్రీహాన్ గీతూని నామినేట్ చేస్తూ ‘ఈ మగాళ్లకు బుద్ధి లేదు’ అన్నారని అందరు మగాళ్లని ఎందుకు అన్నారని ప్రశ్నించాడు. దానికి గీతూ ‘ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటే, కుక్కకి నిజంగా ఒక రోజు వస్తుందని కాదని, అది ఒక స్టేట్మెంట్ ’ అంటూ వాదించింది. ఫైమా కుండపై రేవంత్ ఫోటో పెట్టి పగులగొట్టింది. రేవంత్ అన్నకు చాలా కోపమని అది తనకు నచ్చలేదని చెప్పింది.
ఆరోహితో వాదన
ఆదిరెడ్డి నామినేట్ చేయడానికి వచ్చి ఆరోహితో మాట్లాడాడు. ఆమెతో ఎందుకు వాదించాడో ఆయనకే తెలియాలి. ఆరోహిని ‘నా పెర్ఫామెన్స్ కనిపించలేదా, నీకన్నా’ అని అడిగాడు. దానికి ఆరోహి అందరితో మాట్లాడడం కూడా ఆటలో భాగమని తనకు కనిపించలేదని అంది. ఇంట్లో ఉన్న ఇతర సభ్యులకన్నా తన పెర్ఫామెన్స్ బెటర్ అనిపించలేదా అడిగాడు మళ్లీ. లేదని చెప్పేసింది ఆరోహి. ఆదిరెడ్డి జంటగా వచ్చిన మెరీనా - రోహిత్ లను నామినేట్ చేశాడు. వాళ్లిద్దరూ జంటగా రావడమే సమస్యని చెప్పుకొచ్చాడు. అందరూ ఒక బుర్రతో ఆలోచిస్తుంటే వీరి దగ్గర మాత్రం రెండు బుర్రలు ఆట గురించి ఆలోచిస్తున్నాయని అన్నాడు. దానికి రోహిత్ ‘మేం జంటగా రావాలన్నది బిగ్ బాస్ డెసిషన్. మాది కాదు. మీరు బిగ్ బాస్ డెసిషన్‌నే నామినేట్ చేస్తున్నట్టు’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి అవునని ఒప్పుకున్నాడు.
గీతూ ఎవరికేసిందంటే...
గలాటా గీతూ రేవంత్‌ను నామినేట్ చేసింది. ఆయన కామెడీ చాలా ఓవర్ అవుతుందని, ఇలా అన్నాడేమిటి? అనిపిస్తుందని చెప్పింది. అర్జున్ కూడా రేవంత్‌నే నామినేట్. కామెడీ ఓవర్ అవుతుందని నామినేట్ చేశాడు. ఇక నేహా గీతూని నామినేట్ చేసింది. ఆమె చేసే కంప్లయింట్లు, మాట తీరు, చెప్పే విధానం తనకు నచ్చడం లేదని, ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పింది. గీతూ ఆమెతో వాదించింది. చలాకీ చంటి కూడా గీతూనే నామినేట్ చేశాడు. ‘నువ్వు ఏదైతే చేస్తావో, అది నువ్వు పాటించవు’ అంటూ చురకలు వేశాడు. వీరిద్దరూ కాసేపు వాదించుకున్నారు. ఇక రోహిత్ - మెరీనా కలిసి ఆదిరెడ్డిని నామినేట్ చేశారు. ఆయన తమను నామినేట్ చేస్తూ చాలా చైల్డిష్ కారణం చెప్పారని అన్నారు. ఇక శ్రీసత్య, అభినయశ్రీ షానీని నామినేట్ చేశారు. కారణం చాలా సేఫ్ గా ఆడుతున్నారని, కోపం కూడా ఇంతవరకు చూపించలేదని అన్నారు. ఇక సుదీప గీతూని నామినేట్ చేసింది.
రేవంత్ వర్సెస్ కీర్తి
కార్తీకదీపం హీరోయిన్ కీర్తి, రేవంత్ మధ్య కాసేపు గట్టిగా వాదన అయ్యింది. ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. ‘నేను సాఫ్ట్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా సాఫ్ట్ గా మాట్లాడు’ అంటూ గట్టిగా అరిచింది కీర్తి. రేవంత్ కూడా అదే స్థాయిలో అరిచాడు. ఇక రేవంత్ గీతూని నామినేట్ చేశాడు. వీరిద్దరి వాయిస్ పెద్దదే. ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ‘మెల్లగా మాట్లాడమంటావా? గట్టిగా మాట్లాడమంటావా?’ అని అడిగాడు రేవంత్. దానికి గీతూ ‘నీకెట్టా ఇష్టమైతే అట్టా మాట్లాడు, నేనెట్టా చెప్పేది’ అంది. దానికి ‘ఎక్స్ ట్రాలు వద్దు’ అన్నాడు రేవంత్. ‘నేను ఎక్స్ ట్రాలే మాట్లాడతా’ అంది గీతూ. ‘నువ్వంటేనే నాకసహ్యం’ అన్నాడు రేవంత్. ఇక ఇనయా ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. దానికి ఆదిరెడ్డి 15 వారాల్లో ప్రతి రోజూ నామినేట్ అయినా తాను ఫీలవ్వనని అన్నాడు. ఇక షానీ తన గురించి తాను చెప్పుకున్నాడు. తాను ఎప్పటిలానే ఉన్నానని, ఎవరైనా తనను విసిగించి, సతాయించి కోపం వచ్చేలా చేయమని కోరాడు. ఆయన అభినయశ్రీని నామినేట్ చేశాడు.
వాసంతి ఫైమాను నామినేట్ చేసింది. రాజశేఖర్, రేవంత్‌ను నామినేట్ చేశాడు. ఇక కెప్టెన్ గా బాలాదిత్య ఇద్దిరిని నామినేట్ చేసుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆయన రాజశేఖర్, షానీని నామినేట్ చేశారు.
ఈ వారం నామినేట్ అయిన సభ్యులు
1. రాజశేఖర్
2. రేవంత్
3. అభినయశ్రీ
4. ఆదిరెడ్డి
5. గీతూ
6. షానీ
7. రోహిత్ -మెరీనా
8. ఫైమా
Also read: నామినేషన్ డే - రెండో వారమే వేడెక్కిన వాతావరణం, ఏం ఇరగదీశావ్ అంటూ ఆరోహిపై ఆదిరెడ్డి ఫైర్
Also read: ఈ వారం 'నో' ఎలిమినేషన్ - మరో ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్!