Cobra Movie: పైరసీ వీడియోలు చూస్తున్నారా? మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు, ‘కోబ్రా’ కాటేశాడుగా!
చియాన్ విక్రమ్ సినిమా విడుదల నేపథ్యంలో మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పైరసీని ప్రోత్సహించే వెబ్ సైట్లను నిషేధించాలని వెల్లడించింది..
పైరసీ భూతం సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. థియేటర్లలో తొలి షో పడగానే.. ఆయా వెబ్ సైట్లలో సినిమాలు దర్శనం ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు పైరసీ వెబ్ సైట్లు.. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా.. విడుదలైన కొద్ది సేపటికే తమ సైట్లలో అప్ లోడ్ చేస్తున్నాయి. అలాంటి పలు పైరసీ వెబ్ సైట్ల మీద మద్రాసు హైకోర్టు సీరియస్ అయ్యింది. తమిళ టాప్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా సినిమా ‘కోబ్రా’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆయా వెబ్ సైట్ల మీద వేటు వేయాలని పోలీసులను ఆదేశించింది.
మద్రాసు కోర్టును ఆశ్రయించిన ‘కోబ్రా’ నిర్మాత
వినాయక చవితి సందర్భంగా ‘కోబ్రా’ విడుదల అవుతుండటంతో సినిమా నిర్మాత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పైరసీ భూతం పేట్రేగిపోతున్న నేపథ్యంలో.. ఇందుకు ఊతం ఇస్తున్న 1788 వెబ్ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ చంద్రకుమార్ రామ్మూర్తి విచారించారు. పిటిషనర్ తరుఫున న్యాయవాది విజయన్ సుబ్రహ్మణియన్ వాదనలు వినిపించారు. సినిమాల కోసం ఎంతో మంది ఎన్నో నెలల పాటు శ్రమిస్తారని, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని వెల్లడించారు. నిర్మాతలు ఎన్నో సమస్యలను ఎదుర్కొని సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుంటే.. కొన్ని వెబ్‌సైట్లు చట్ట వ్యతిరేకంగా పైరసీకి పాల్పడుతున్నాయని చెప్పారు. ఫలితంగా నిర్మాతలు భారీ నష్టాలను చవిచూస్తున్నారని వెల్లడించారు. ఎంతో మంది సినీ కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా ఆయా వెబ్ సైట్లపై నిషేధం విధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రకుమార్ కోబ్రా చిత్రాన్ని చట్ట విరుద్ధంగా వెబ్‌సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
పలు పాత్రల్లో విక్రమ్.. విలన్ గా ఇర్ఫాన్ పఠాన్
చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ సినిమాతో సుమారు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతున్నారు. రేపు(ఆగస్టు31న) ఈ చిత్రం విడుదల కాబోతుంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీపై.. తాజాగా విడుదల అయిన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతో కష్టపడ్డారట. మ్యాథమేటిక్స్ సైంటిస్టుగా పలు విభిన్న గెటప్స్‌లో కనిపించబోతున్నాడట. అంతేకాదు.. అన్ని గెటప్పులకు ఆయనే డబ్బింగ్ చెప్పారట. ఇక ఈ చిత్రంలో విక్రమ్‌కు జోడీగా ‘కేజీఎఫ్’ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి హీరోయిన్లుగా నటించారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించారు. తమిళ్, తెలుగు, మలయాళం సహా పలు భాషల్లో కోబ్రా సినిమా రిలీజ్ కాబోతున్నది. చాలా కాలం తర్వాత విక్రమ్ సినిమా వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Also Read : హిందీ నటుడు, విమర్శకుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు