Kolkata: జైల్ గార్డులతో ప్రత్యేకంగా మాట్లాడిన నిందితుడు, వెలుగులోకి షాకింగ్ విషయాలు!
Kolkata Case: కోల్‌కతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ జైల్ గార్డులతో మాట్లాడాడు. తనకు ఈ నేరంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ జైల్ గార్డ్‌లతో చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తనకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు నిందితుడు. ఇప్పుడు జైల్‌లోని గార్డులతో మరి కొన్ని విషయాలు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. పేరు చెప్పడానికి ఇష్టపడని జైల్ అధికారులు ఈ విషయం వెల్లడించారు. కోల్‌కతా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సంజయ్ రాయ్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ రోజు ఏం జరిగిందో అంతా వివరించాడు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు తనకు సంబంధమే లేదని అంటున్నాడు.
నిర్దోషినని, అందుకే లై డిటెక్టర్ టెస్ట్‌కి అంగీకరించానని కోర్డులో జడ్జ్ ముందే చెప్పాడు. మొత్తంగా చూస్తే మాత్రం సంజయ్ రాయ్ మాటలు నమ్మేలా లేవని అంటున్నారు పోలీసులు. ఒక్కోసారి ఒక్కో విధంగా స్టేట్‌మెంట్స్ ఇస్తుండడమే ఇందుకు కారణం. ఇదంతా కేవలం పోలీసులను తప్పుదోవ పట్టించడానికే చేస్తున్నాడా అన్న సందేహమూ వ్యక్తమవుతోంది. సంజయ్ రాయ్ ముఖంపై గాయాలయ్యాయి. వాటి గురించి కూడా పోలీసులు విచారించారు. కానీ ఎక్కడా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్టు సమాచారం. అసలు ఆ సమయంలో సెమినార్ రూమ్ వైపు ఎందుకు వెళ్లావ్ అని అడిగినా సరైన బదులు ఇవ్వడం లేదు సంజయ్ రాయ్.
"పొంతన లేని సమాధానాలు చెప్పి విచారణ అధికారులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడు. తన ముఖంపై గాయాల గురించి విచారిస్తే సరైన బదులు ఇవ్వడం లేదు. శరీరంలో మరి కొన్ని చోట్లా గాయాలు కనిపించాయి. వాటికీ సమాధానం లేదు. సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తే సంజయ్ రాయ్ సెమినార్ రూమ్ వద్ద ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. క్రైమ్ సీన్‌లో తెల్లవారుజామున 4.03 గంటలకు కనిపించాడు"
- అధికారులు
నిజానికి ఆగస్టు 24వ తేదీనే సంజయ్ రాయ్‌కి పాలిగ్రఫీ టెస్ట్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. ఇవాళ (ఆగస్టు 25) ఈ టెస్ట్ నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. అయితే...హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో నలుగురు డాక్టర్‌లకి లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. ప్రస్తుతానికి జైల్‌లో ఉన్న సంజయ్ రాయ్‌ని అక్కడే ఉంచి ఈ టెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అతని సెల్ వద్దే సీసీ కెమెరాలు పెట్టారు. నిఘా పెంచారు. ఇప్పటి వరకూ జరిగిన విచారణలో సీబీఐ అధికారులు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. సంజయ్ రాయ్ అశ్లీల వీడియోలు చూడడానికి బాగా అలవాటు పడ్డాడని, అతని ఆ ఆలోచన తప్ప మరో ధ్యాసే లేదని అన్నారు. పైగా తరచూ రెడ్‌లైట్ ఏరియాకి వెళ్లే అలవాటు కూడా ఉందని చెప్పారు. ఈ క్రైమ్ జరిగిన రోజు కూడా నిందితుడు ఇద్దరు వేశ్యలతో గడిపినట్టు విచారణలో తేలింది.