Kolkata: ఆ గది తలుపు గడియ పని చేసుంటే ఈ దారుణం జరిగేదే కాదేమో, కాపలా కాసి నిందితుడికి ఎవరైనా సహకరించారా?
Kolkata Case: సెమినార్ రూమ్ గడియ పని చేయడం లేదని హాస్పిటల్‌లోని వైద్యులు చెబుతున్నారు. ఇదే అదనుగా చూసుకుని నిందితుడు లోపలికి వెళ్లి హత్యాచారానికి పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార ఘటనలో మరో అనుమానం తెరపైకి వచ్చింది. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో సెమినార్ రూమ్‌లో ఈ హత్యాచారం జరిగింది. తెల్లవారు జామున ఈ దారుణానికి పాల్పడ్డాడు నిందితుడు సంజయ్ రాయ్. అయితే..అదేమీ నిర్మానుష్య ప్రాంతం కాదు. ఓ హాస్పిటల్. అందులోనూ నైట్ డ్యూటీలో బాధితురాలితో పాటు మరి కొందరు వైద్యులూ ఉన్నారు. ఓ గంట ముందు వరకూ అక్కడ ఏదో అలికిడి ఉంది. చివరిసారిగా ఓ జూనియర్ డాక్టర్ బాధితురాలితో మాట్లాడాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాక ఆ సెమినార్ రూమ్‌లో ఆమె విశ్రాంతి తీసుకుంది. అయితే...సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే తెల్లవారుజామున 2-3 గంటల సమయానికి నిందితుడు సెమినార్ రూమ్ వద్ద కనిపించాడు. ఆ తరవాతే రూమ్‌లోకి వెళ్లి హత్యాచారం చేశాడు.
ఓ గంట తరవాత అక్కడి నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం. అంటే దాదాపు గంట సేపు అక్కడే ఉన్నాడు. కానీ అంత జరిగినా అక్కడ ఏ చప్పుడూ రాలేదా..? ఆమె ప్రతిఘటించలేకపోయిందా..? లేకపోతే చప్పుడు రాకుండా నిందితుడు పక్కా ప్లాన్‌తో దాడి చేశాడా..? ఈ చిక్కుముడులెన్నో ఉన్నాయి. మరో కీలక విషయం ఏంటంటే.. ఆ సెమినార్ రూమ్ గడియ విరిగిపోయింది. అంత సేపూ ఎవరూ అక్కడికి రాకుండా ఉన్నారా అన్నది మరో ప్రశ్న. సీబీఐ అధికారులు మరో కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. అక్కడికి ఎవరూ రాకుండా సెమినార్ రూమ్ బయట ఎవరైనా కాపలా కాశారా అని అనుమానిస్తున్నారు.
ఈ అనుమానాలు తీర్చుకునేందుకు సెమినార్ రూమ్ వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. ఓ చోట మాత్రం నిందితుడు సంజయ్ రాయ్ కనిపించాడు. అయితే..అక్కడ ఇంకెవరైనా ఉండి నిందితుడికి సహకరించారా అన్నదే తేలాల్సి ఉంది. అంత దారుణం జరుగుతుంటే ఎవరూ అటు వైపు రాకుండా ఎలా ఉంటారు అన్నదే అంతు చిక్కని ప్రశ్న. అయితే...చాలా రోజుగా సెమినార్ రూమ్ గడియ పని చేయడం లేదని మిగతా వైద్యులు చెబుతున్నారు. అందుకే బాధితురాలు నిద్రపోయిన సమయంలో తలుపు మూయడానికి వీల్లేకుండా పోయిందని వివరించారు. ఇదే అదనుగా చూసి నిందితుడు హత్యాచారం చేసి ఉంటాడని అంటున్నారు.
ఈ డాక్టర్లు చెప్పిన వివరాలనూ సీబీఐ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. రూమ్ బయట ఎవరో కాపలా కాసి ఇదంతా చేయించారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నప్పటికీ ఇంకా ఈ విషయంలో క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు మొత్తం ఆరుగురికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారు అధికారులు. వీరిలో హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా ఉన్నాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన రాజీనామా చేశాడు. అంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చిందని సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది. లై డిటెక్టర్ టెస్ట్‌లో భాగంగా మొత్తం 25 ప్రశ్నలు అడిగినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.