హ్యండిల్ లాక్ వేయడం మరిచారంటే మీ వాహనం మాయమైపోయినట్లే!
హ్యాండిల్ లాక్ వేసిన బైకులను మాత్రమే చోరీ చేస్తూ అమ్ముకునే ముగ్గురు దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ తోపాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో తాళం వేయడం మరిచిపోయిన ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను టాస్క్ ఫోర్స్, స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి 12 లక్షల రూపాయల విలువగల 12 ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ... నిందితులు ముగ్గురు వరంగల్ జిల్లాకు చెందిన వారిగా తెలిపారు. వర్ధన్నపేటకు చెందిన ఉడత హరీష్, రాయపర్తికి చెందిన వొల్లెల సుధాకర్, బొమ్మెర కిరణ్ ముగ్గురూ ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురూ స్నేహితులు. అయితే వీరు చేసే పనుల ద్వారా వచ్చే ఆదాయం వీరి జల్సాలకు సరిపోకపోవడంతో బైక్ దొంగతనాలకు తెరలేపారు.
బైకు దొంగతనం చేసి ముందుగా దొరికిన హరీష్..
ఇందులో భాగంగానే నిందితులు గత సెప్టెంబర్ మాసంలో ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, పాలకుర్తి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు, సుబేదారి, జీఆర్పీ కాజీపేట భువనగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు హరీష్. మిగతా ఇద్దరు నిందితులు కిరణ్, వికలాంగుడైన సుధాకర్ ఇరువురు దొంగలించిన వాహనాలను తమ దగ్గర ఉంచుకొని వాటి అమ్మకానికి పెట్టేవారు. నిందితులిద్దరూ ద్విచక్ర వాహనాలు అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు. అయితే స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతంలో ఓ బైకు దొంగతనం కేసులో హరీష్ ను ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా ఇలాంటి చోరీలు ఎక్కువగా జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకొని మిగతా నిందితులను కూడా పట్టుకున్నారు.
హ్యాండిల్ లాక్ వేయడం అస్సలే మరిచిపోవద్దు..
వారిని పూర్తిగా విచారించగా.. నేరాన్ని ఒప్పుకున్నారు. దొంగతనం చేసినట్లు ఆంగీకరించారు. హ్యాండిల్ లాక్ చేయని ద్విచక్ర వాహనాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేసినట్లు తెలిపారు. అలాగే హరీష్ దొంగతనం చేసి బైకులను తీసుకు వస్తే తమ ఇళ్లలో దాచుకొని కొంత కాలం తర్వాత అమ్మేసే వారని తెలపారు. వీరి చెప్పిన వివరాలతో నిందితుల ఇళ్లలో దాచిన ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లవణ్ కుమార్, పాలకుర్తి ఎస్.ఐ శ్రీకాంత్, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించి రివార్డులు అందజేశారు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనాలకు హ్యండిల్ లాక్ వేయడం అస్సలే మరువ వద్దని పోలీసులు తెలిపారు. వాహనాన్ని పార్కింగ్ చేసే సమయంలో వాహనదారుడు తప్పనిసరిగా హ్యండిల్ లాక్ వేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సూచించారు.
Also Read : బుల్లెట్ బైక్‌లే టార్గెట్‌గా చోరీలు, 2 నెలల్లో 100కు పైగా మాయం - మిస్టరీగా మారిన కేసు