Warangal: చినుకుల వేళ దోస్తులతో మందు సిట్టింగ్, ఇంతలో ఊహించని ఘటన - ముగ్గురూ మృతి
Warangal News: దసరా పూట స్నేహితులంతా కలిసి దావత్ చేసుకున్నారు. ఓ గుట్టపై ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుని మద్యం తాగుతుండగా... పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Warangal News: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. దసరా రోజు దావత్ చేసుకుంటున్న వారిపై పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామానికి చెందిన నేరెళ్లి శివ, మరుపట్ల సాంబరాజు, జెట్టబోయిన సాయికృష్ణ సహా మరో ఐదుగురు దసరా పండుగ సందర్భంగా దావత్ చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే సాగరం గ్రామ శివారులోని ఓ గుట్టవద్దకు చేరుకున్నారు. చికెన్ వంటివి తెచ్చుకొని ఓ మర్రిచెట్టు కింద కూర్చొని మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్షం ప్రారంభమైంది. అయినా వీళ్లు అదేం పట్టించుకోకుండా హాయిగా గడుపుతున్నారు. దురదృష్టవశాత్తు వారు కూర్చున్న చోటే పిడుగు పడింది. ఈ ఘనటోల శివ, సాంబరాజు, సాయికృష్ణలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు కూడా పిడుగుపాటుకు గాయపడ్డారు.
వీరి ద్వారా విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుత్రికి తరలించారు. పండుగ నాడే కుమారులు చనిపోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముగ్గురు యువకులు ఒకేరోజు మృతి చెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుకున్నాయి.
పండుగపూట ఘోర రోడ్డు ప్రమాదం...
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 55 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు పౌరీ జిల్లాలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 21 మందికి తీవ్ర గాయలయ్యాయి.
ఇదీ జరిగింది...!
ధూమకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమ్ది గ్రామ సమీపంలో ఈ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. బస్సు 500 మీటర్ల లోతు ఉన్న లోయలో పడిపోయింది. మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఘటనలో 25 మంది మృతదేహాలు వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మరో 21 మందిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. హరిద్వార్ జిల్లాలోని లాల్‌ధాంగ్ నుంచి పౌరీ జిల్లా బీర్‌ఖాల్ బ్లాక్‌కు బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో పెళ్లి కోసం వచ్చిన జనం ఉన్నారని పోలీసులు చెప్పారు.
" ధూమకోట్‌లోని బీరోఖల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన పౌరీ గర్వాల్ బస్సు ప్రమాదంలో 25 మంది మరణించారు. పోలీసులు, SDRF రాత్రిపూట 21 మందిని రక్షించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు చేర్చారు." - అశోక్ కుమార్, డీజీపీ
మోదీ సంతాపం..
పౌరీ గర్వాల్ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
" ఉత్తరాఖండ్‌లోని పౌరీలో జరిగిన బస్సు ప్రమాదం వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తాం." - -ప్రధాని నరేంద్ర మోదీ