Chitrakoot Temple: చారిత్రక ఆలయంలో విగ్రహాల చోరీ - పీడకలలు రావడంతో దొంగల ముఠా ఏం చేసిందంటే !
Thieves Return Stolen Ldols: ఏ విశ్వాసాలు, భయాలు లేకుండా తమకు కావాల్సింది చోరీ చేయాలని అనుకుంటే మాత్రం దొంగల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ పీడకలల భయంతో యూపీలోని దొంగల ముఠా విగ్రహాలు తిరిగొచ్చేసింది.
తప్పు చేస్తే కళ్లు పోతాయి. దేవుడు అన్నీ చూస్తుంటాడని పెద్దలు చెబుతారు. అయితే ఏ విశ్వాసాలు, భయాలు లేకుండా తమకు కావాల్సింది చోరీ చేయాలని అనుకుంటే మాత్రం దొంగల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ పోలీసులు ఎంట్రీతో రోజులోనో, వారానికో, నెలకో ఏదో ఓ సమయంలో దొంగలు దొరికిపోతుంటారు. ఓ దొంగల బృందం దేవుడిపై భయం కలగడంతో తాము చోరీ చేసిన వస్తువులను తిరిగిచ్చేసింది. ఇలా కూడా జరుగుతుందా అనుకుంటున్నారా. ఇది నిజం. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
చిత్రకూట్ జిల్లా తరౌన్హాలోని పురాతన బాలాజీ ఆలయంలో ఓ దొంగల ముఠా 16 దేవతల విగ్రహాలను మే 9వ తేదీన చోరీ చేసింది. దేవుళ్ల విగ్రహాలు చోరీ అయ్యాయనని మహంత్ రామబలక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ సింగ్ తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన శ్రీవారి ఆలయంలో విగ్రహాలు చోరీ చేశాక, ఆ దొంగల ముఠాను పీడకలలు వెంటాడాయి. రోజూ భయంకరమైన కలలు రావడంతో భాయాందోళనకు గురైన దొంగల టీమ్ ఎలాగైనా విగ్రహాలను వదిలించుకోవాలని భావించింది.
ఎత్తుకెళ్లింది 16, తిరిగిచ్చింది 14..
పీడకలలు వెంటాడటంతో తకు కీడు జరుగుతుందని దొంగలు ఆందోళన చెందారు. ఇకలాభం లేదనుకుని తాము చోరీ చేసిన 16 విగ్రహాలలో తమ వద్ద మిగిలి ఉన్న 14 విగ్రహాలను ఆలయ పూజారి మహంత్ రామ్‌బలక్ ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా దేవుళ్ల విగ్రహాలు పూజారి ఇంటి ఆవరణలో ప్రత్యక్షమయ్యాయి. దేవతల విగ్రహాలు తిరిగిచ్చేయడానికి కారణాలను దొంగల ముఠా ఓ లేఖలో రాసినట్లు ఆయన గుర్తించారు. విగ్రహాలు చోరీ చేసిన తరువాత తమను పీడ కలలు వెంటాడుతున్నాయని, దేవుడిపై భయంతోనే వాటిని తిరిగివచ్చేస్తున్నట్లు లేఖలో తెలిపింది దొంగల ముఠా.
ఔరంగజేబు కట్టించిన ఆలయం..
మొగల్ సుల్తాను ఔరంగజేబు ఈ చారిత్రక ఆలయాన్ని కట్టించాడు. దాదాపు 350 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాజీ ఆలయాని ఔరంగజేబు కట్టించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. తన జీవితకాలంలో ఎన్నో హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, కొల్లగొట్టడం లాంటి చర్యలకు పాల్పడిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబు.. ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషమని చెప్పవచ్చు. శ్రీవారి ఆలయం కోసం నిధులు సైతం సమకూర్చుతూ ఆలయ బాగోగులు చూసుకున్నాడు. సరిగ్గా అదే ఆలయంలో 16 విగ్రహాలను ఓ దొంగల ముఠా చోరీ చేసింది. పీడ కలలు వెంటాడటంతో విగ్రహాలను తిరిగిచ్చేయడంతో పాటు ఓ లేఖలో అందుకు గల కారణాలను దొంగలు తెలపడంతో ఈ ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.