Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్
Udaipur Murder Case: ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు 2611 బైక్ నంబర్ కోసం అదనంగా రూ. 5 వేలు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు.
Udaipur Murder Case: రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది. కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రియాజ్ అత్తారీ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌కు ముంబయి ఉగ్రదాడులతో సంబంధం ఉందని తేలింది. నవంబర్ 26, 2011న ముంబయిలో జరిగిన ఉగ్రదాడిని గుర్తుచేసుకోవడానికి రియాజ్ బైక్ కు RJ 27 AS 2611 నంబర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
26/11 నెంబర్ కోసం రూ. 5 వేలు చెల్లింపు
నిందితుడు రియాజ్ బైక్ కొనుగోలు, 2611 ప్రత్యేక నంబర్ ఎలా తీసుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. ఈ నెంబర్ కోసం రియాజ్ 2013లో అదనంగా రూ. 5,000 డిపాజిట్ చేసినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 29న కన్హయ్య లాల్ అనే టైలర్ హత్య తర్వాత, నిందితులు ఈ బైక్‌పై పారిపోయారు. తరువాత భీమా పట్టణంలో రాజ్‌సమంద్ పరిధిలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి దాడి తేదీతో పోలిన బైక్ నంబర్ వెనుక నిందితుల ఉద్దేశాన్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
అసలేం జరిగింది?
రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం కన్హయ్య లాల్ అనే టైలరును ఇద్దరు యువకులు అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది. మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిషృత నేత నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా కన్హయ్య లాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడని ఇద్దరు దుండగులు అతడిని దారుణంగా కత్తులతో నరికి చంపారు. టైలర్ ను హత్య చేస్తున్న దృశ్యాలను దుండగులు రికార్డ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు నిందితులు. ప్రధాని మోదీని కూడా హత్య చేస్తామని ఆ వీడియోలో హెచ్చరించారు. ఆ వీడియోలో ఇద్దరు నిందితుల్లో రియాజ్, మహ్మద్ అని పరిచయం చేసుకున్నారు. ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యా లాల్‌ను దుండగులు కత్తితో 26 సార్లు నరికినట్టు పోస్టుమార్గం రిపోర్టులో తేలింది. తలపై 8-10 సార్లు నరికినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర రక్తస్రావం కారణంగా టైలర్ చనిపోయాడని నివేదికలో వైద్యులు తెలిపారు. ఈ హత్య ఘటనకు ముందు కన్హయ్య లాల్ తనకు ప్రాణహాని ఉందని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా కాంప్రమైజ్ చేసి పంపినట్లు సమాచారం. వారం రోజుల పాటు టైలర్ షాపు కూడా తీయలేదని, మంగళవారం షాపు తెరవగా అదే రోజు అతడు హత్యకు గురయ్యాడు.