Dog Attack: దారుణం - కుక్కల దాడిలో చిన్నారి మృతి, ఎక్కడంటే?
Hyderabad News: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు విచక్షణా రహితంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Child Died in Dog Attack: హైదరాబాద్ (Hyderabad)లో దారుణం జరిగింది. నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కల దాడిలో రెండున్నరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ గడ్ రాష్ట్రం బిలాస్ పూర్ జిల్లా కొప్రా గ్రామానికి చెందిన విశ్వప్రసాద్, పుష్పబాయి దంపతులు సుచిత్ర సమీపంలోని బీమ్ కాలమ్స్ నిర్మాణ సంస్థలో దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను తన కుటుంబంతో కలిసి రేకుల షెడ్డులో నివసిస్తున్నాడు. శుక్రవారం దంపతులు ఇద్దరూ కూలీ పనికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో వారి చిన్న కూతురు దీపాళి తోటి పిల్లలతో కలిసి షెడ్డు ముందు ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రెండు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. దీంతో బాలిక తల, చేతులకు తీవ్ర గాయలయ్యాయి. తోటి పిల్లలు భయంతో పరుగున వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వారు అక్కడికి చేరుకోవడంతోనే కుక్కలు పారిపోయాయి.
పరిస్థితి విషమించి..
చిన్నారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు నీలోఫర్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. ఆ రోజు రాత్రి అక్కడికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుని వీధి కుక్కలను నియంత్రించాలని కోరుతున్నారు.
Also Read: Rajendra Nagar News: రాజేంద్ర నగర్ లో ఘోర ప్రమాదం - నుజ్జైన కారు, ఇద్దరు మృతి