Suicide Cases: బైక్ కొనివ్వలేదని ఒకరు, మంచి జాబ్ లేదని మరో యువకుడు ఆత్మహత్య
Suicide Cases: తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఓ విద్యార్థి, మంచి ఉద్యోగం రాలేదని మరో యువకుడు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒకరు పురుగుల మందు తాగగా, మరొకరు రైలు కింద పడి బలవన్మరణం చేస్కున్నారు.
Suicide Cases: రోజురోజుకూ ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. చిన్న చిన్న సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడుతూ... నమ్ముకున్న వారిని ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువకుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, ఫోన్ కొనివ్వలేదని, బైక్ కొనివ్వలేదని, మంచి ఉద్యోగం లేదని, ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, లవర్ బ్రేకప్ చెప్పిందంటూ ఇలా చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలే తాజాగా జరిగాయి. తెలంగాణలోని వేర్వేరు జిల్లాలో ఈ విషాదాలు జరిగాయి.
బైక్ కొనివ్వలేదని మనస్తాపం..
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాధవానిపల్లికి చెందిన ఓ విద్యార్థి.. బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన గాజుల వెంకటేశ్(19) అచ్చంపేటలో ఓపెన్ ఇంటర్ చదువుతున్నాడు. గత కొంత కాలంగా తల్లిదండ్రులను ద్విచక్ర వాహనం కొనివ్వమని అడుగుతున్నాడు. ఆర్థిక స్తోమత బాగా లేకపోవడంతో తాము బైక్ కొనివ్వలేమని చెప్పారు. కొంత కాలం నుంచి ఇంట్లో దీనిపై చర్చ నడుస్తోంది. అయితే ఇదే విషయమై వెంకటేష్ సోమవారం తల్లిదండ్రులతో తగాదా పడ్డాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పొలం పనులను వెళ్లగానే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగాడు.
ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి..
పురుగులు మందు తాగి చాలా సేపు అలాగే ఇంట్లోనే ఉండిపోయాడు. దాంతో కడుపు నొప్పితో పాటు విపరీతమైన వాంతులు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వెంకటేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అచ్చంపేట ఆసుపత్రికి ఆటోలో తరలిస్తుండగా... మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు బలవన్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అమ్రాబాద్ పోలీసులు తెలిపారు.
సరైన ఉద్యోగం దొరక్క.. కఠిన నిర్ణయం
కడప జిల్లాకు చెందిన కంచర్ల గంగ మహేశ్వర్ రెడ్డి(29) బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసమని హైదరాబాద్ చేరుకున్నాడు. గచ్చిబౌలిలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అయితే చాలా కాలంగా ఇతడు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ ఉద్యోగం మానేసి నెల కిందట సికింద్రాబాద్ బోయిగూడకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సరైన ఉద్యోగం దొరకడం లేదని, కాలం గడిచిపోతోందని మనస్తాపానికి గురయ్యాడు.
రైలు కింద పడి ఆత్మహత్య..
ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని వాషింగ్ యార్డ్, ఆర్ఆర్ఐ క్యాబన్ బొల్లారం లైన్ ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికిలు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న హెడ్‌కానిస్టేబుల్ డేవిడ్‌రాజ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడి వద్ద లభ్యమైన ఆధార్‌కార్డు, పాన్‌కార్డుల ఆధారంగా మహేశ్వరరెడ్డిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలుపగా.. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా చనిపోవడం ఎంటంటూ బావురుమన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.