RTC Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ- ఇద్దరు మృతి, మరో 15 మందికి గాయాలు
Annamayya District : అన్నమయ్య జిల్లా నందలూరులో కడప - చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో.. లారీ డ్రైవర్, బస్సు కండక్టర్ అక్కడిక్కడే మృతి చెందారు.
![RTC Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ- ఇద్దరు మృతి, మరో 15 మందికి గాయాలు Two dies in lorry collided with rtc bus in annamaya district Andhra Pradesh RTC Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ- ఇద్దరు మృతి, మరో 15 మందికి గాయాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/14/60b071af1fdc834c3988d454fd0d3f3f17209611782061037_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
RTC Bus Accident News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో లారీ డ్రైవర్, కండక్టర్ స్పాట్లోనే చనిపోయారు. బస్సులోని మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆల్విన్ ఫ్యాక్టరీ దగ్గర కడప- చెన్నై నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ మద్యం సేవించి అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆర్టీసీ కండక్టర్, లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు.
కేబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్
కేబిన్‌లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్‌ను బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొందరిని కడప రిమ్స్ కు, మరికొందరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉండడంతోపాటు, అధిక లోడుతో నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడు యల్లటూరు శ్రీనివాసరాజు క్షతగాత్రులను పరామర్శించారు.
ప్రమాదం పై స్పందించిన మంత్రి
కడప జిల్లా రాజంపేట రోడ్డు ప్రమాదం పై రవాణా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృత్యువాత పడ్డ కండక్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నందలూరు వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందటం శోచనీయమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రభస
అన్నమయ్య జిల్లా రాజంపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో రభస చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో సంబంధిత ఆర్తో డాక్టర్ లేకపోవడంతో క్షతగాత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సూపరిడెంటెంట్ ను వివరణ కోరగా.. ఆర్తో డాక్టర్ అందుబాటులో లేడని సమాధానమివ్వడంతో క్షతగాత్రులు బంధువులు గొడవకు దిగారు. సరైన వైద్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని క్షతగాత్రులు వారి బంధువులు హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)