Tirupati Accident: ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, లోయలో పెళ్లి బస్సు బోల్తా - చిన్నారి సహా 8 మంది మృతి
Tirupati Accident : చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 50 మందితో తిరుపతి వెళ్తున్న పెళ్లి బస్సు లోయలో పడిపోయింది.
![Tirupati Accident: ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, లోయలో పెళ్లి బస్సు బోల్తా - చిన్నారి సహా 8 మంది మృతి Tirupati Bhakarapet ghat road accident wedding bus crashed in valley Tirupati Accident: ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, లోయలో పెళ్లి బస్సు బోల్తా - చిన్నారి సహా 8 మంది మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/26/49e61d9d2751880f522706da1e892727_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirupati Road Accident : చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులోపెళ్లి బృందం బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి చిత్తూరు జిల్లా తిరుపతికి వెళ్తుండగా మలుపు వద్ద ప్రైవేట్ బస్సులో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. మొదట ఆరుగురు చనిపోగా, నారావారిపల్లె పీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొదుతూ చిన్నారి చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య 8 కి పెరిగింది. తాజాగా మరో వ్యక్తి చనిపోయారు.
బస్సులో మొత్తం 50 మంది వరకు ప్రయాణిస్తుండగా.. పెళ్లి కొడుకుతో పాటు 45 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ప్రైవేట్ బస్సు లోయలో పడ్డ ఈ ప్రమాదంలో డ్రైవర్ నబీ రసూల్, మలిశెట్టి వెంగప్ప (60), మలిశెట్టి గణేశ్ (40), మలిశెట్టి మురళి (45), కాంతమ్మ (40), జె.యశస్విని(8), ట్రావెల్స్ క్లీనర్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని తిరుపతి రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
ఉదయం ఎంగేజ్‌మెంట్.. రాత్రికి రాత్రే విషాదం
అనంతపురం జిల్లా ధర్మవరం రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం చేశారు. తిరుచానూరులో ఆదివారం ఉదయం నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నిశ్చితార్థం చేసుకునేందుకు వరుడు వేణు కుటుంబం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు దాదాపు 50 మందితో బయలుదేరింది. చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి ఓ దాబా వద్ద భోజనాలు చేశారు. అక్కడి దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించగా భాకరాపేట ఘాట్‌లో ఓ మలుపు వద్ద అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ లోయలో పడటంతో ప్రమాదం జరిగింది.
Also Read: Srikakulam Crime : పట్టపగలే గొడ్డళ్లతో వెంటపడి వాలంటీర్ దారుణ హత్య, డీఎస్పీ ఆఫీస్ పక్కనే ఘటన!
డ్రైవర్ అతివేగమే కారణమా!
ఉదయం ఎంగేజ్ మెంట్ కావడంతో రాత్రికి రాత్రే వరుడి కుటుంబం అక్కడికి చేరుకోవాలని భావించింది. డ్రైవరు అతి వేగంగా నడపటంతో మలుపువద్ద అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ 100 అడుగుల లోయలో పడిపోయింది. అర్ధరాత్రి కావడంతో అసలేం జరిగిందో కూడా బాధితులకు అర్థం కాలేదు. ఒక్కసారిగా బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో చాలా మంది కాళ్లు, చేతులు విరిగాయి. గాయపడ్డ వారి రోదనలతో ఆ ప్రాంతం భయానక వాతావరణం నెలకొంది. గాయపడ్డ వారిలో చిన్నారులు, మహిళలు కూడా 10 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)