Telangana News: తెలంగాణలో విషాదాలు - చెట్టుని కారు ఢీకొని ముగ్గురు మృతి, ఇంకా!
Road Accidents: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో శనివారం అర్ధరాత్రి ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు.
Severe Road Accident In Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో (Nagarkurnool) శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మత్స్యబొల్లారానికి చెందిన మాచర్ల కిషన్ కన్నయ్య (22) తన ముగ్గురు స్నేహితులతో కలిసి శనివారం రాత్రి కారులో శ్రీశైలం జలాశయం సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రున్ని సమీపంలోని నంద్యాల జిల్లా సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిని కిషన్ కన్నయ్యగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న మరో బస్సు
మరోవైపు, తూప్రాన్ దగ్గర NH - 44 జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోనకు చెందిన బస్సు శనివారం రాత్రి పాడైతే ఇద్దరు మెకానిక్స్ రిపేర్ చేస్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి డిపోనకు చెందిన డీలక్స్ బస్ వేగంగా వచ్చి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ రిపేర్ చేస్తోన్న మెకానిక్స్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.
అటు, భద్రాచలం పట్టణంలోని తాతగుడి సెంటర్‌లో గత కొంతకాలంగా శిథిలావస్థలో ఉన్న ఇల్లు కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు నాని ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అందులో నిద్రిస్తున్న వెంకన్న అనే హోటల్ వర్కర్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.