(Source: ECI/ABP News/ABP Majha)
ASI House Robbery : పోలీస్ ఇంట్లోనే చోరీ చేసిన దొంగ ! ఆ తర్వాత సీన్ ..
హైదరాబాద్‌లో ఓ ఏఎస్‌ఐ ఇంట్లో దొంగలు పడ్డారు. కుమార్తె పెళ్లి కోసం తెచ్చి పెట్టుకున్న నగలు, నగదును దోచుకెళ్లారు.
ఇంటి ముందు పోలీస్ అనే నేమ్ బోర్డు ఉందంటే... అటు వైపు నడుచుకుంటూ వెళ్లే వాళ్లు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఇక నేర పూరిత ఆలోచనలు ఉన్న వారిలో బీవేర్ ఆఫ్ పోలీస్ అనుకుని ఆ ఇంటికి కాస్త దూరం దూరంగా ఉంటారు, కానీ అన్నీ తెలిసి ఆ ఇంటిలోనే చేసే వారినేమంటారు...? గుండెలు తీసిన బంటులయినా అవ్వాలి లేకపోతే ఇంటిదొంగలయినా అవ్వాలి. ఈ రెండు కేటగిరీల్లో ఏ కేటగిరీ దొంగ ఆ పని చేశాడా అని హైదరాబాద్ పోలీసులు తమ నేర పరిశోధనా సామర్థ్యం మొత్తాన్ని ఉపయోగించి పరిశోధిస్తున్నారు. ఎందుకంటే.. తమ ఎఎస్‌ఐ ఇంటినే కొల్లగొట్టి.. కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ. 35 లక్షల సొత్తు ఎత్తుకెళ్లిపోయాడు మరి.
హైదరాబాద్‌లో ఓ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న ముదావత్ శంకర్ మీర్ పేట విజయనపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె పెళ్లి వచ్చే నెలలో ఉంది. ఇందు కోసం పెళ్లి ఖర్చులు... కుమార్తె కోసం బంగారం అన్నీ సమకూర్చి పెట్టుకున్నారు. ఇందులో రూ. 17 లక్షల నగదుతో పాటు మరో 20 లక్షలు విలువ చేసే బంగారం ఉంది. పెళ్లి పనుల నిమిత్తం భార్యతో కలిసి ఏఎస్ఐ శంకర్ రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ లోని కలకొండకు వెళ్లారు. పనులు చూసుకుని వచ్చే సరికి ఇంటి తాళాలు బద్దలుకొట్టి ఉన్నాయి. పెళ్లి కోసం దాచి పెట్టుకున్న నగలు, నగదు మాయం అయ్యాయి.
దీంతో శంకర్ పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు వేలి ముద్రలు ఇతర ఆధారాలు సేకరించారు. పట్టపగలే దొంగతనం చేశారు కాబట్టి బాగా తెలిసిన వాళ్లే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అది పోలీస్ ఇల్లు అని తెలిసినా బయట దొంగలు అంత ధైర్యం చేయరని అనుమానిస్తున్నారు. అందుకే ముందుగా శంకర్ తన కుమార్తె పెళ్లి కోసం నగలు, నగదు తెచ్చి పెట్టుకున్నారని ఎంత మందికి తెలుసో.. వారిపై దృష్టి పెట్టి విచారణ జరుపుతున్నారు. కుటుంబసభ్యులు కాకుండా ఆయన కదలికలు ఎక్కువగా ఎవరికి తెలుసో వారి గురించి కూపీ లాగుతున్నారు.
పోలీస్ కుటుంబంలోని వ్యక్తి కావడం.. కుమార్తె పెళ్లికి తెచ్చుకున్న నగదు, నగదు కావడంతో దొంగతనం విషయాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దొంగను పట్టుకుని సొత్తును రికవరీ చేయాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా ఏక్షణమైనా దొంగను పట్టేసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.