Srikakulam : తండ్రి కర్మకాండ చేసేందుకు వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు
Srikakulam : తండ్రి చనిపోయిన నాలుగు రోజులుకే కుమారుడు మరణించిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
Srikakulam : ఆ కుటుంబంతో విధి ఆటలాడుకుంది. ఇంట్లో తండ్రి చనిపోయిన నాలుగు రోజులకే కుమారుడిని బలితీసుకుంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం సుభలయ ఆర్ ఆర్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు దువ్వారపు సూర్యరావు గుండెపోటుతో సోమవారం చనిపోయారు. అయితే ఆయన కుమారుడు లలిత్ సాగర్ (30) శుక్రవారం ఉదయం పితృ కార్మకాండల్లో భాగంగా నిత్యవిధి నిర్వహించేందుకు వంశధార నదిలో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లు వెంటనే రంగంలోకి దిగి వెదకగా గంట తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లలిత్ సాగర్ మృతదేహాన్ని పాతపట్నం పోస్టుమార్టం కోసం తరలించారు. లలిత్ సాగర్ కు భార్య సుమ, పదినెలల కుమార్తె ఉన్నారు. వీరికి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. లలిత్ సాగర్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే ఏకైక కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
టీ తాగి ఐదుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. విష రసాయనాలు కలిసిన టీ తాగి ఇద్దరు చిన్నారులు, వారి తండ్రి సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్‌పురి జిల్లా నగ్లా కన్హాయ్ గ్రామంలో ఈ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళ గురువారం తన ఇంట్లో టీ పొడిగా పొరపడి, పొలంలో పిచికారీ చేసిన పురుగుల మందు డబ్బాలోని పౌడర్‌ను వేసి టీ కాచింది. ఇది తాగిన భర్త శివనందన్ (35), కుమారులు శివాంగ్ (6), దివ్యాన్ష్ (5)తో పాటు తన తండ్రి రవీంద్ర సింగ్ (55), పొరుగునుండే సొబ్రాన్ (42)లకు ఇచ్చిది. తాగిన తర్వాత వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రవీంద్ర సింగ్, శివాంగ్, దివాన్ష్ ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.