Siddipet Road Accident: ప్రమాదవశాత్తు గుంతలో పడిన కారు - ఐదుగురు దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు
Siddipet Road Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారు అదుపుతప్పి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Siddipet Road Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఈ నీటి గుంతలో పడిపోయింది. ఈ క్రమంలోనే కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం మునిగడప మల్లన్న ఆలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మునగడప మల్లన్న ఆలయం మూల మలుపు వద్ద ఉన్న గుంతలో కారు పడిపోయింది ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. విషయం గుర్తించిన స్థానికులు గుంతలోకి దిగి తీవ్రంగా గాయపడిన వారిని బయటకు తీశారు. 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మరో వ్యక్తి మృతి చెందాడు. అయితే మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ప్రస్తుతం కొన ప్రాణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులు ఎక్కడి వారు, ఎక్కడికి వెళ్తున్నారు వంటి విషయాల గురించి మాత్రం తెలియరాలేదు.
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం - అక్కడికక్కడే ముగ్గురు మృతి
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు శివారు ఎరసాని గూడెం వద్ద హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఖమ్మం వాసులు ఎండీ ఇద్దాక్(21), ఎస్.కే సమీర్(21), ఎస్.కే యాసీన్(18)లుగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి ఖమ్మం వెళ్తుండగా.. వేకువ జామున ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు.
నూతన సంవత్సరం ప్రారంభం రోజే హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ మూడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న టీఎస్ 07 ఎక్స్ 5195 నంబర్ గల కారు రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న డివైడర్ ను ఢీకొట్టి అదుపు తప్పింది. వెంటనే మరో రెండు కార్లను కూడా ఢీకొట్టింది. ఇదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢీకొట్టగా.. వారు గాల్లోకి ఎగిరి పడ్డారు. కింద పడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు.