Secunderabad Protest : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసు, ప్రధాన సూత్రధారి అతడే
Secunderabad Protest : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి కామారెడ్డికి చెందిన మధుసూదన్ అని పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 56 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
Secunderabad Protest : సైనిక బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన ఆందోళనలకు సంబంధించి కామారెడ్డికి చెందిన మధుసూదన్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారంతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సికింద్రాబాద్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కు కుట్ర చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ అల్లర్లకు సంబంధించి 56 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిలో 46 మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 10 మందిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పలు డిఫెన్స్ అకాడమీల డైరెక్టర్లు యువకులను రెచ్చగొట్టినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
రిమాండ్ రిపోర్టులో కీలక ఆంశాలు
సికింద్రాబాద్ ఆందోళన కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. రైల్వే స్టేషన్ విధ్వంసంలో మొత్తం 56 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. పది మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కామారెడ్డికి చెందిన మధుసూదన్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులు చేర్చారు. 56 మంది నిందితులు ఆర్మీ ఫిజికల్, మెడికల్ ఫిట్‌నెస్ లో అర్హత సాధించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో దానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని అల్లర్లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీమ్ పెట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్స్, చలో సికింద్రాబాద్ ARO3 గ్రూప్, మరికొన్ని గ్రూపులు క్రియేట్ చేశారని వెల్లడించారు. ఈ గ్రూపు ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు ఈ విధ్వంసానికి సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కామారెడ్డి యువకుల ప్రమేయం!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన ఘటనలో కామారెడ్డికి చెందిన యువకులు ఉన్నట్లు ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులకు ప్రాథమిక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొందరు యువకులు ఘటనలో గాయాలయ్యాయనే ప్రచారం కామారెడ్డిలో జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు వివరాలు పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంత మంది కామారెడ్డికి చెందిన యువకులు ఉన్నా రో..? నిజామాబాద్ లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో సీసీ పుటేజీల ద్వారా స్పష్టం కానుంది.