Secunderabad News : కెమిస్ట్రీ ల్యాబ్ లో విషవాయువులు లీక్, 25 మంది విద్యార్థులకు అస్వస్థత!
Secunderabad News : సికింద్రాబాద్ కస్తూర్బా కాలేజీలో విషవాయువులు లీకై 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Secunderabad News : సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా కళాశాలలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు లీకై విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కళాశాల ప్రయోగశాలలో విషవాయువులు లీకై ప్రమాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులను గాంధీ హాస్పిటల్ తో పాటు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించారు. తమ పిల్లల పరిస్థితిని తెలుసుకోడానికి పెద్ద ఎత్తున హాస్పిటల్ కు చేరుకుంటున్నారు తల్లిదండ్రులు.
Hyderabad, Telangana | 25 students suffer from giddiness and fall ill after an alleged chemical gas leak in a lab in Kasturba govt college. Affected students have been rushed to the hospital. Forensic teams have reached the spot to ascertain which gas got leaked. pic.twitter.com/PdgbPGdrIs
— ANI (@ANI) November 18, 2022
కెమిస్ట్రీ ల్యాబ్ లో గ్యాస్ లీక్
సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లి కస్తూర్బా కాలేజీలోని సైన్స్ ల్యాబ్‌లో విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులకు పైగా అస్వస్థతకు గురవ్వడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వెస్ట్ మారేడ్‌పల్లి లోని కస్తూర్బా కాలేజీలో ఇంటర్ బ్లాక్‌లోని కెమిస్ట్రీ ల్యాబ్‌లో విద్యార్థినులు ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ల్యాబ్ లో విషవాయువులు లీక్ అవ్వడంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో 14 మంది విద్యార్థినులు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై బాధిత విద్యార్థినులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు కళాశాలకు చేరుకొని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.
వికటిస్తున్న మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనాల నిర్వహణ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాఠశాలల్లో భోజనాలు చేస్తున్న విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురౌతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారులు నిర్వహణ లోపాలపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించింది. వారం రోజులుగా 10 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి వందకు పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. రెండు లక్షల మందికి పైగా చిన్నారులకు నిత్యం మధ్యాహ్న భోజనం వండుతున్నారు. అయితే పాఠశాలల్లో భోజన నిర్వహణ లోపాల కారణంగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు.
నాణ్యత లేని బియ్యం
నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట, గాంధారి, నాగిరెడ్డి పేట మండలం చీనూరు, నవీపేట, బిర్కూరు మండలాల్లోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పాఠశాలల్లో 50 మందికి పైగా విద్యార్థులు వాంతులు , విరేచనాలతో దవాఖానా పాలయ్యారు. స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటిస్తూ విద్యార్థులు ఆసుపత్రుల పాలుకావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు. నాణ్యత లేని బియ్యం, నిర్వహణ లోపాల కారణంగా తరచూ సమస్యలు వస్తున్నాయంటున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకులకు పెరిగిన ధరల ప్రకారం డబ్బులు చెల్లించకపోడంతో తక్కువ ధరల్లో లభించే కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా నాణ్యత లేని బియ్యం, ఇతర సామాగ్రితో వండుతున్న భోజనం వికటించి విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నట్లు తెలుస్తోంది.