![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Asifabad District: జైనూర్ ఘటన మరువక ముందే ఆసిఫాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం, ఉరితీయాలంటూ నిరసన
Telangana Crime | జైనూరులో ఆదివాసీ మహిళలై పాశవికంగా అత్యాచారం జరిగిన ఘటన మరువకముందే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో దారుణం జరిగింది. విద్యార్థినిపై ఓ యువకుడు అఘాత్యానికి పాల్పడ్డాడు.
![Asifabad District: జైనూర్ ఘటన మరువక ముందే ఆసిఫాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం, ఉరితీయాలంటూ నిరసన School Girl Molested while returning home from school in Asifabad District Asifabad District: జైనూర్ ఘటన మరువక ముందే ఆసిఫాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం, ఉరితీయాలంటూ నిరసన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/28/34c295cd4c6caffb6360e5b0ea6735c91727538667783233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Asifabad Crime News Updates | జైనూర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌లో ఓ ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన మరువక ముందే జిల్లాలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడా గ్రామంలో శుక్రవారం స్కూల్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఎనిమిదో తరగతి మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడు ఇంట్లోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
విద్యార్థిని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని చెప్పింది. దీంతో వెంటనే మైనర్ అమ్మాయి కుటుంబ సభ్యులు నిందితుడు అయిన సాగర్ ఇంటికి వెళ్లి అడిగే ప్రయత్నం చేయగా తలుపులు పెట్టుకొని గది లోపలే ఉన్నాడని తెలిపారు. అతడు తలుపులు తీయకపోగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అమ్మాయిని వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్య నిర్ధారణ పరీక్షలు చేశారు.
ఈ ఘటనకు నిరసనగా శనివారం బూరుగూడ గ్రామస్తులు, విద్యార్థులు ఆసిఫాబాద్ - చంద్రపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. నిందితునికి కఠిన శిక్ష విధించాలని జాతీయ రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిందితున్ని ఉరి శిక్ష వేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఇలాంటి వరుస సంఘటనలు జరిగినప్పటికీ అధికారులలో ఎలాంటి చలనం లేదంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
జైనూరులో జరిగిన సంఘటన మరిచిపోక ముందే మైనర్ బాలికపై అత్యాచారం జరగడం సిగ్గుచేటు అంటూ పలువురు వాపోతున్నారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు అంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మహిళలకు రక్షణ లేదని.. ఎందరో నిందితులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి పేరు, పలుకుబడిలతో నాయకుల సపోర్టుతో శిక్ష అనుభవించకుండా బయట తిరుగుతున్నారని వాపోతున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి అఘాయిత్యాలు జరగవని మండిపడుతున్నారు. అఘాయిత్యాలకు పాల్పడిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని మనలో మార్పు రాకపోతే ఎంత చేసినా ప్రయోజనం ఉండదని పోలీసులు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)