Mlc Anantababu : రాజమండ్రి జైలులో తోటి ఖైదీపై ఎమ్మెల్సీ అనంతబాబు దాడి!
Mlc Anantababu : మాజీ డ్రైవర్ హత్య కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు తోటి ఖైదీపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీని చూసేందుకు ప్రజాప్రతినిధులు తరచూ వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Mlc Anantababu : మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు జైలులో తోటి ఖైదీపై దాడి చేసినట్లు సమాచారం. ఒక విషయంపై ఇద్దరికి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో ఎమ్మెల్సీ అనంతబాబు కోపంతో తోటి ఖైదీపై చెయ్యి చేసుకున్నారని సమాచారం. అయితే జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు సకల సౌకర్యాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పడుకునేందుకు పరుపు, కోరిన ఆహారం బయటి నుంచి అందుతోందని విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీని జాగ్రత్తగా చూసుకోవాలని పై స్థాయి నేతల నుంచి ఆదేశాలు, తీవ్ర ఒత్తిడి వస్తుందని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం జైలులో ముగ్గురు ఖైదీలకు ఒక గది కేటాయిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఒక్కరికే ఓ గది కేటాయించినట్లు తెలుస్తోంది.
14 రోజుల రిమాండ్
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు హత్య కేసులో మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఈ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు జైల్లో ప్రవర్తిస్తున్న తీరు, ఆయనకు లభిస్తున్న రాచమర్యాదలు, ములాఖత్ లు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఎమ్మెల్సీని కలుస్తున్న ప్రజాప్రతినిధులు!
ఎమ్మెల్సీ అనంతబాబును కలిసేందుకు తరచూ ప్రజాప్రతినిధులు వస్తున్నట్లు తెలుస్తోంది. రిమాండ్ ఖైదీని కుటుంబ సభ్యులు మాత్రమే కలవాలని నిబంధన ఉంది. అది కూడా ప్రత్యక్షంగా ఒకసారి, ఫోనులో ఒకసారి మాట్లాడవచ్చు. ఎమ్మెల్సీ అనంతబాబు జైలుకు తరలించిన రోజుల వ్యవధిలో న్యాయవాదిని అని చెప్పి ఒకరు కలవగా, అనంతరం రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కలిశారు. ఆ తర్వాత కూడా అనధికారికంగా కొందరు ప్రజాప్రతినిధులు కలుస్తున్నట్లు సమాచారం.
అసలేం జరిగింది?
ఏపీలో సంచలనమైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుబ్రహ్మణ్యం రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయాడని నాటకం ఆడి కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసిన అనంత బాబు ఆ తర్వాత నిజం ఒప్పుకున్నాడు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అనంతబాబు తెలిపాడు. తానొక్కడే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అనంత బాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.