Rajahmundry News : అప్పు చేస్తే ప్రాణం రాసిచ్చినట్లే, లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య
Rajahmundry News : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజమండ్రికి చెందిన ఓ యువకుడు లోన్ యాప్ అప్పు తిరిగి చెల్లించినా వేధింపులు ఆగకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
Rajahmundry News : రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా లోన్ యాప్ నిర్వాహకుల తీరు మారడంలేదు. ఇచ్చిన అప్పుకు మూడింతలు వసూలు చేయడమే కాకుండా అప్పు చేసిన వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. అత్యవసరంలో అప్పు కోసం ఆన్ లైన్ లోన్ యాప్ వలలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘనలు నిత్యం ఏదొక చోట వెలుగులోకి వస్తున్నాయి. మేం చెప్పినంత డబ్బు కట్టకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతాం, మీ బంధులకు పంపంచి మీ పరువు తీస్తామన్న లోనాసురుల బెదిరింపులతో ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు. లోన్ యాప్ లో అప్పు చేస్తే ఇక ఆత్మహత్య శరణ్యం అన్నట్లు చేస్తున్న కేటుగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎంతలా ప్రయత్నిస్తున్నా పరిష్కారాలు మాత్రం చూపలేకపోతున్నాయి. తక్కువ వడ్డీకే లోన్ అంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లోన్ యాప్ లను అదుపుచేసేందుకు మరింత కఠిన చట్టాలు చేయాలని బాధిత కుటుంబాలు అంటున్నాయి. ఈ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు ప్రాణం కోల్పోయాడు.
మరో యువకులు బలి
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ధవళేశ్వరం సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ పలు లోన్‌యాప్‌ల నుంచి అప్పు తీసుకున్నాడు. అయితే క్రమం తప్పకుండా తీసుకున్న లోన్ లను తిరిగి చెల్లిస్తున్నాడు. అయితే లోన్ తిరిగి చెల్లించినప్పటికీ ఇంకా కట్టాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు స్టార్ట్ చేశారు. అప్పు చెల్లించినా వేధింపులు ఆగకపోవడంతో శ్రీనివాస్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. లోన్ యాప్ లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా వేధించడంతో శ్రీనివాస్‌ను ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ మంగాదేవి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు.
కోట్లలో మోసాలు
రాజమండ్రిలో లోన్ యాప్ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. లోన్ యాప్ లో అప్పు చేసినందుకు న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామన్న బెదిరింపులతో భార్యభర్తలు సూసైడ్ చేసుకున్న ఘటన ఇటీవల రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మూడు దశాల్లో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి రాజమండ్రి నుంచి గుజరాత్ కు నగదు తరలిస్తున్నట్లు రాజమండ్రి పోలీసులు గుర్తించారు. వందల్లో కరెంట్ అకౌంట్లు, సూట్ కేసు కంపెనీలు పెట్టి కోట్లలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మొదటి దశలో సుమారు 80 నుంచి 100 సేవింగ్ ఖాతాలు సృష్టించి, ఒక్కో అకౌంట్ నుంచి ప్రతి నెల సుమారు 100 మందికి అప్పు ఇచ్చి దానికి రెండు, మూడు వంతులు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా బాధితుల నుంచి వసూలు చేసిన నగదును 2వ దశలో సుమారు 20 కంపెనీల పేర్లతో ఓపెన్ చేసిన కరెంటు అకౌంట్లకు బదిలీ చేస్తున్నారు. ఈ కరెంటు అకౌంట్ లావాదేవీలు పరిశీలించగా ఒక్కొక్క అకౌంట్లో ఒక నెలకు సుమారు రూ.15-20 కోట్ల వరకు ఈ విధంగా లోన్ యాప్ నుంచి అప్పు తీసుకున్న వారిని బెదిరించి వసూలు చేస్తున్నారు. ఈ సొమ్మును 3వ దశలో గుజరాత్ లో ఉన్న షెల్ కంపెనీల అకౌంట్లకు బదిలీ చేసి ఆ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసి హవాల మార్గంలో లోన్ యాప్ ఓనర్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.