Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Chittoor Cell Phone Theft : చిత్తూరు జిల్లా పరిధిలో మూడు కోట్ల 60 లక్షల రూపాయల విలువైన 1700 ఫోన్లు రికవరీ చేశామని ఎస్పీ మణికంఠ తెలిపారు. కేసుకు సంబంధించిన విషయాలు విలేకర్లకు తెలిపారు.
Chittoor News : చిత్తూరు జిల్లా పరిధిలో భారీగా విలువైన సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దశలవారీగా మూడు కోట్ల 60 లక్షల రూపాయల విలువైన 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆదివారం ఉదయం పోలీసు గెస్ట్ హౌసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాట్ బాట్ అప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు 45 లక్షల రూపాయల విలువైన 200 మొబైల్ ఫోన్లను గుర్తించామన్నారు. ఇలా మొత్తం మూడు దశల్లో మూడు కోట్ల 60 లక్షల రూపాయల విలువైన 1700 ఫోన్లు రికవరీ చేశామని వివరించారు.
కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల నుంచి ఫోన్లు రికవరి చేసి బాధితులకు అప్పజెప్పినట్లు తెలిపారు. బయటి ప్రాంతాల్లో ఉన్న వారికి కొరియర్ ద్వారా పంపామన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ముందుగా 9440900004 నంబర్ కు హాయ్(HI )అని లేదా HELP మెసేజ్ ఇవ్వాలన్నారు. ఆ తరువాత పోలీస్ శాఖ నుంచి వచ్చే లింక్ లో పూర్తి చిరునామా తో పాటూ IMEI నెంబర్ నమోదుచేయాలన్నారు. అనంతరం కేసును ఛేదించిన పలువురు సిబ్బందిని ఎస్పీ మణికంఠ అభినందించారు.
సెల్ ఫోన్ చోరీల ముఠా గుట్టురట్టు
అలాగే హైదరాబాదులో కలకలం కలకలం సృష్టించిన సెల్‌ఫోన్ చోరీ ముఠా గుట్టు రట్టు చేశారు గోపాలపురం పోలీసులు. ఈ నెల 19న అర్థరాత్రి చోరీలతో భయానక వాతావరణాన్ని సృష్టించిన మసూద్ ఉర్ రహమాన్, ఫజల్ ఉర్ రహమాన్ అనే ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి బైక్, మారణాయుధాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మసూద్ ఉర్ రహమాన్ పై గతంలో నాచారంలో ఒకటి, మైలార్‌దేవ్‌పల్లిలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు. మసూద్ జల్సాలకు అలవాటు పడి సెల్ ఫోన్ చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే తరహా కేసుల్లో మసూద్ అరెస్ట్ అయినట్లు తెలిపారు. ఈనెల 19న బంధువుల ఇంటికి వచ్చిన మసూద్ తన ఫ్రెండ్ అయిన ఫజల్‌కి ఫోన్ చేశాడు. ఇద్దరూ కలిసి 19న అర్ధరాత్రి ఛాదర్‌ఘాట్ వైపు వెళ్లిన అక్కడ రోడ్డుపై ఉన్న బైక్ దొంగిలించారు. దానిని మలక్‌పేటలోని ఓ హోటల్ ముందు పార్క్ చేసి సికింద్రాబాద్ వైపు వెళ్లారు.
సెల్ ఫోన్ చోరీ చేస్తూ దొరికిపోయాడు
సికింద్రాబాద్ లోని గణేశ్ ఆలయం ముందు స్టేషన్ వైపు వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి మొబైల్ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. తమ వద్ద ఉన్న కత్తితో బెదిరించి మొబైల్ లాక్కొని వెళ్లారు. వారు తప్పించుకుని వెళ్లే క్రమంలో స్థానికులకు కత్తులు చూపిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఘటనాస్థలంలో బాధితుడు సాయం కోసం కేకలు వేయడంతో రంగంలోకి దిగిన యాంటీ స్నాచింగ్ టీమ్ నిందితులను పట్టుకునేందుకు వెంబడించింది. మరో చోరీ చేసేందుకు వారు ప్రయత్నిస్తుండగా నిందితులపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బులెట్ మసూద్ కాలికి తగిలింది. అయినా పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి 48 గంటల్లో పట్టుకున్నారు.