Raj Kundra : రాజ్ కుంద్రాకు బెయిల్ నిరాకరించిన బాంబే హైకోర్టు
పోర్న్ సినిమాలు తీస్తున్నారన్న కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాకు ఇంకా బెయిల్ లభించలేదు. తాజాగా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది.
అశ్లీల చిత్రాలు తీస్తున్నారన్న కేసులో అరెస్టయిన శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రాకు హైకోర్టులోనూ బెయిల్ లభించలేదు. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీనికి ఆయనకు ఉన్న బ్రిటిష్ పౌరసత్వమే కారణం అయింది. రాజ్ కుంద్రా ఇండియన్ అయినప్పటికీ.. ఆయన కుటుంబం ఇంగ్లాండ్‌లో స్థిరపడింది. ఈ కారణంగా ఆయన బ్రిటన్ పౌరుడిగా మారిపోయారు. అక్కడి పౌరసత్వం ఉంది. శిల్పాషెట్టిని పెళ్లి చేసుకుని ఇండియాకు మకాం మార్చినా ఆయనకు బ్రిటన్ పౌరసత్వమే ఉంది.. అక్కడి పాస్ పోర్టే వాడుతున్నారు. ఈ కారణాన్నేముంబై పోలీసులు ప్రధానంగా కోర్టు ముందు ఉంచారు.
బ్రిటన్ పౌరుడిగా ఉన్న రాజ్ కుంద్రాకు బెయిల్ ఇస్తే.. ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రాజ్ కుంద్రాతో పాటు ఆయన స్నేహితుడు సాంకేతికంగా చాలా సాక్ష్యాలు మాయం చేశారని ఆరోపించారు. రాజ్ కుంద్రాకు సంబంధించిన డేటాలను పరిశీలించి.. మొత్తంగా వందకు పైగా అడల్ట్ మూవీలను స్వాధీనం చేసుకున్నామని కోర్టుకు తెలిపారు. సున్నితమైన కేసు అయినందున..బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. అయితే.. తాను అశ్లీల చిత్రాలు తీయలేదని.. వెబ్ సిరీస్‌లు మాత్రమే తీస్తున్నానని.. రాజ్ కుంద్రా తరపు లాయర్ వాదించారు. కానీ ముంబై పోలీసుల వాదననే ముంబై హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
రాజ్ కుంద్రాతో పాటు సహ నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పోర్న్ చిత్రాల కేసులో రాజ్ కుంద్రాపై రోజు రోజుకు ఆరోపణలు పెరుగుతున్నాయి. పలువురు నటీమణులు.. రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేస్తున్నారు. రాజ్ కుంద్రా సినిమాల్లో నటించిన.. నటి-మోడల్ షెర్లిన్ చోప్రాను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే తనకు తెలియకుండానే తన ప్రైవేటు పార్ట్స్‌ను చిత్రీకరించారని ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మరికొంత మంది మోడల్స్ కూడా రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఈ కేసు అంశంపై బాలీవుడ్‌లో ఎవరూ పెద్దగా స్పందించడం లేదు.
కొంత మంది మాత్రం.. శిల్పాషెట్టికి మద్దతుగా మాట్లాడుతున్నారు. రాను రాను ఈ కేసు మరిన్ని మలుపులు తిరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరికొంత మంది బాధితులు తెరపైకి వస్తే.. మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే.. అసలు రాజ్ కుంద్రా తీస్తున్న పోర్న్ కాదని.. ఎరోటిక్ మూవీస్ అని వాదించే వాళ్లు కూడా ఉన్నారు. ఇది నేరం కాదని అంటున్నారు. అయితే ముంబై పోలీసులు మాత్రం ఖచ్చితంగా రాజ్ కుంద్రా మహిళల్ని మోసం చేసి పోర్న్ చిత్రాలు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయంటున్నారు.