Nirmal News: గాఢ నిద్రలో ఉండగా ఇంట్లో పేలిన సిలిండర్ - మహిళ సజీవ దహనం!
Telangana News: ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు వ్యాపించి సిలిండర్ పేలడంతో మహిళ సజీవ దహనమైంది.

Nirmal Latest News: నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో ఇంట్లో సిలిండర్ పేలి ఓ మహిళ సజీవ దహణమైంది. శనివారం రాత్రి 10.30గంటల సమయంలో సిలిండర్ పేలి మహిళ సజీవ దహనమైనట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన లింగన్న- దుర్పతిబాయి దంపతులు చుట్టూ తడకలు, పైన రేకులతో వేసిన షెడ్డులో నివసిస్తున్నారు. లింగన్న గ్రామంలోని ఓ ఆలయంలో రాత్రి భజన కార్యక్రమానికి వెళ్లాడు. దుర్పతిబాయి(49) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు వ్యాపించి సిలిండర్ పేలడంతో ఆమె సజీవ దహనమైంది.
భారీ శబ్దంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందోనని వచ్చి చూసే సరికి ఇంట్లో మంటలు వ్యాపించి ఆ మహిళ కాలిబూడిదైంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భైంసా రూరల్ పోలీసులు పేర్కొన్నారు.





















