Nellore Crime News: దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ దాడి, ఎందుకంటే?
Nellore Crime News: పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఓ దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ దాడి చేశాడు. పెట్రోల్ పోయమంటే సర్వర్ పని చేయడం లేదని చెప్పిన కారణంగా చితకబాదాడు.
Nellore Crime News: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాళ్ల పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఓ దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ విచక్షణారహితంగా దాడి చేశారు. బొడిగుడిపాడు వైసీపీ ఎంపీటీసీ మహేష్ నాయుడుకు పెట్రోల్ కోసమని వచ్చారు. అయితే అప్పటికే సర్వర్ పని చేయని కారణంగా అందులో పనిచేసే దళిత యువకుడు తేజ పెట్రోల్ పోయలేమని చెప్పాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మహేష్ నాయుడు .. తేజపై అత్యంత దారుణంగా అనుచరులతో కలిసి దాడి చేశారు. ఎంత బతిమాలినా వినకుండా ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు.
దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ దాడి.కావలి నియోజకవర్గం, దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పెట్రోల్ బంక్ లో సర్వర్ పనిచేయని కారణంగా పెట్రోల్ పట్టలేమన్నందుకు దళిత యువకుడు తేజపై అత్యంత దారుణంగా అనుచరులతో కలిసి దాడి చేశాడు బొడిగుడిపాడు వైసిపి ఎంపీటీసీ మహేష్ నాయుడు.@JanaSenaParty @PawanKalyan pic.twitter.com/K9Ujbdbw2R
— VALLURU KIRAN JANASENA (@KIRANJSP111) January 3, 2023
ఈ ఘటనపై పలువురు నెటిజెన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సేవ చేయాల్సిన ఓ వ్యక్తి ఇలా దళిత వ్యక్తిపై దాడి చేయడం దారుణం అంటున్నారు. కేవలం దళిత వ్యక్తి అన్న కారణంగానే ఇలా కొట్టాడంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరట్ నెట్టింట వైరల్ గా మారింది.
నెలరోజుల క్రితం వైసీపీ దాడిలో గాయపడ్డ నలుగురు వ్యక్తులు..
ఏలూరు జిల్లాలో వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పీఏ సహా మరో ముగ్గురు టీడీపీ నేతలు గాయపడ్డారు. జిల్లాలోని పెదవేగి మండలం కొప్పాక సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తిని కలిసేందుకు శివబాబు మరికొంత మందితో కలిసి జీపులో పెదకడిమి గ్రామంలోని రాజా తోటకు వెళ్తుండగా అలుగులగూడెం వెంతెన వద్ద వైసీపీ వర్గీయులు వీరి వాహనాన్ని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తూనే, కర్రలు, రాడ్డులతో దాడికి దిగారు. ఈ ఘటనలో శివబాబు, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివబాబు తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కొప్పాక సమీపంలోని పోలవరం కుడి కాలువ వద్ద వైసీపీకి చెందిన కొందరు జేసీబీలతో మట్టి తవ్విస్తున్నారని, అదే సమయంలో తాము అటుగా వెళ్లడంతో వారిని అడ్డుకునేందుకు వెళ్తున్నామనుకొని తమపై దాడి చేశారని శివబాబు తెలిపారు. తమపై దాడి చేసిన వారిలో వైసీపీకి చెందిన కొప్పాక రంగారావు, పచ్చిపులుసు శివ, మరికొంత మంది ఉన్నారని ఆరోపించారు.
దాడి జరిగిందని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భార్య రాధ బాధితులను పరామర్శించారు. అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్న సమయంలోనే.. వీరిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారావు, శివ మరికొందరు వైద్యం కోసం ఇక్కడే చేరారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.