Allagadda Crime : ప్రియుడితో కలిసి భర్త మర్డర్, పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు!
Allagadda Crime : ఆళ్లగడ్డలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో మహిళ. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపి గోనె సంచిలో కట్టి పడేశారు.
Allagadda Crime : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమేనని, ఎంతవరకైనా దారితీస్తుందని డీఎస్పీ వెంకటరామయ్య అన్నారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియాతో డీఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ... ఆళ్లగడ్డ పట్టణం యేసునాథపురం చెందిన షేక్ కరీముల్లా(38) పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం చేసేవాడు. అతని భార్య షేక్ మాబ్బి , భర్త కరీముల్లా తాగుడుకు అలవాటు పడి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. కరీముల్లా భార్య మాబ్బికి కడప జిల్లా పెద్దముడియం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంశీ కుమార్ రెడ్డి అలియాస్ పవన్ అనే వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విషయంలో కరిముల్లా తన భార్యను మందలించాడు. ఆమెతో గొడవ పడుతూ కొట్టేవాడని ఆ బాధను భరించలేక కరీముల్లాను ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో తన ప్రియుడు వంశీ కుమార్ రెడ్డి తో కలిసి ప్లాన్ చేసింది.
గోనెసంచిలో మూట కట్టి
ఈనెల 1వ తేదీన రాత్రి సుమారు 11 గంటల సమయంలో కరీముల్లా బాగా తాగి ఇంట్లో పడుకొని ఉండగా మాబ్బి కరిముల్లా కాళ్లను కదలకుండా గట్టిగా పట్టుకొని ఉండగా వంశీ కుమార్ రెడ్డి, కరీముల్లా మెడకు వైరుతో బిగించి హత్య చేశారు. కరీముల్లాను హత్య చేసి శవాన్ని గోనెసంచిలో పెట్టి మూట కట్టి అదే ఇంట్లో బీరువాలో మూలకు పెట్టి కనబడకుండా బోంతలు కప్పారు. మరుసటి రోజు ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ పై అర్ధ రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని లింగందినన్నే రోడ్డులోని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు పక్కన ముళ్లపొదల్లో పడేశారు. తమ బంధువుల ఒత్తిడి ఎక్కువ అయ్యేసరికి కరీముల్లా కనపడడంలేదని భార్య మాబ్బి ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
హత్య చేసి ముళ్ల పొదల్లో పడేసి
కరీముల్లా భార్య ఫిర్యాదుతో 7వ తేదీన పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 8వ తేదీన కరీముల్లా మృతదేహం ఆళ్లగడ్డ లింగందిన్నే రోడ్డులో ఉన్న హైవే సర్వీస్ రోడ్డు పక్కన ముళ్లపొదల్లో బయటపడింది. ఈ మృతదేహం తన భర్తదే అని, ఎవరో చంపి ఉంటారని ఫిర్యాదు ఇవ్వగా మిస్సింగ్ కేసును 302, 201 ఐపీసీ సెక్షన్ కింద హత్య కేసుగా మార్చారు. సీఐ జీవన్ రంగనాథ్ బాబు, ఎస్ఐ తిమ్మయ్య సిబ్బంది సహకారంతో ఈ కేసులో అనుమానం ఉన్న వ్యక్తులను విచారించి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు వంశీ కుమార్ రెడ్డి, షేక్ మాబ్బిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. హత్య కేసును ఛేదించిన సీఐ జీవన్ గంగనాథ్ బాబు, ఎస్ఐ తిమ్మాయిలను పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Also Read : పెళ్లై ఐదు నెలలైంది- కలిసే సినిమాకెళ్లారు, కానీ మధ్యలో బయటకు వెళ్లిన భార్య మాయం!