Mlas Poaching Case : ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులకు మరో షాక్, బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు
Mlas Poaching Case : ఎమ్మెల్యే ఎర కేసులో నిందితులకు మరో షాక్ తగిలింది. నిందితుల బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
Mlas Poaching Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దర్యాప్తు వేళ బెయిల్ మంజూరు చేస్తే విచారణకు ఆటంకం ఎదురవుతుందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు.
నిందితుల బెయిల్ రిజెక్ట్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ నాంపల్లి ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఏసీబీ కోర్టు విచారణ చేసింది. పోలీసుల తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్‌ను తిరస్కరించింది. దర్యాప్తు జరుగుతున్న టైంలో బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
నందకుమార్ పై మరో రెండు కేసులు
ఈ కేసులో కీలక నిందితుడు నందకుమార్‌పై మరో రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. డెక్కన్ కిచెన్ హోటల్ యాజమాన్యంతో పాటు నందకుమార్ వద్ద స్థలం లీజుకు తీసున్న మరో వ్యక్తి ఫిర్యాదుతో ఈ రెండు కేసులు నమోదు చేశారు. 2021 జూన్‌లో నందకుమార్ తన స్థలాన్ని వ్యాపారానికి వాడుకోమ్మన్నారని, దీంతో 3 వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు అయాజ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు నాంపల్లి కోర్టులో పోలీసులు నందకుమార్ పై పీటీ వారంట్ దాఖలు చేశారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా నందకుమార్ అరెస్టుకు పోలీసులు కోర్టు అనుమతి కోరుతూ పీటీ వారంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి లభిస్తే నందకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
నందకుమార్ అక్రమ నిర్మాణాలు కూల్చివేత
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నందకుమార్ కు చెందిన చెందిన అక్రమ నిర్మాణాలు జీహెచ్ఎంసీ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేసింది. నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబుకు చెందిన స్థలాన్ని నందకుమార్ లీజుకు తీసుకున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్ కిచెన్ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం నిర్మాత సురేష్ బాబు అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్పందించిన అధికారులు నందకుమార్ కు నోటీసులు ఇచ్చారు. అక్రమంగా నిర్మిస్తున్న భవనం నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని తెలిపారు. అయినప్పటికీ నంద కుమార్ పట్టించుకోకపోవడంతో ఫిలింనగర్ లో ఉన్న నందకుమార్ అలియాస్ నందు హోటల్ డెక్కన్ కిచెన్ భవనాన్ని కూల్చి వేశారు. అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సుప్రీంలో ఎమ్మెల్యేల కొనుగోలు నిందితుల కేసు విచారణ
సుప్రీంకోర్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను వాయిదా పడింది. స్థానిక కోర్టులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వబోతోందని విచారణను వాయిదా వేయాలని నిందితుల తరుఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టు రిమాండ్‌ను సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.
Also Read : Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం, ఆ ఇద్దరికి బెయిల్ మంజూరు!