Vizianagaram Crime News : విజయనగరం గృహనిర్బంధం కేసులో మరో ట్విస్ట్ - చిన్న కోడలి పరిస్థితీ అంతే !
విజయనగరం గృహనిర్బంధం కేసులో మరిన్ని కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ఇంటి చిన్న కోడలిని కూడా అలాగే బంధించడంతో ఆమె వెళ్లిపోయారు. ఇప్పుడు తన కుమారుడిని అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Vizianagaram Crime News : విజయనగరంలో 13 ఏళ్లపాటు భార్య సుప్రియను గృహ నిర్బంధంలో ఉంచిన న్యాయవాది గోదావరి మధుసూదనరావు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తననూ కొన్నేళ్లపాటు గృహనిర్బంధంలో ఉంచారని.. భరించలేక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశా అంటూ సుప్రియ తోడికోడలు.. గోదావరి మధుసూదనరావు సోదరుడు, వెంకట దుర్గాపస్రాద్ భార్య డెంటిస్ట్ వెంకట పుష్పలత తెలిపింది. తన పెద్ద కుమారుడు ఇప్పటికీ అక్కడే ఉన్నాడని, వెంటనే తనకు అప్పగించాలని విజయనగరంలోని అత్తింటి వారి ముందు గురువారం ఆందోళనకు దిగింది.
విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో 13 ఏళ్లపాటు గృహనిర్బంధంలో ఉన్న సుప్రియ బుధవారం ఆ చీకటి రోజుల నుంచి బయటపడ్డారు. ఆమెను తల్లి, సోదరుడు తమతోపాటు తీసుకెళ్లారు. ఈ విషయం సంచలనం కాగా.. గురువారం.. మధుసూదన్ తమ్ముడి భార్య తెరపైకి వచ్చారు. మధుసూదరావు సోదరుడు దుర్గాప్రసాద్ భార్య పుష్పలత అత్తింటివారి ఇంటికి వచ్చి నిరసన తెలియజేసింది. తన పెద్ద కుమారుడు పదేళ్ల గోదావరి దీర్ఘాయుష్ గాయత్రిబాబును అప్పగించాలని వేడుకుంది. 2012లో దుర్గాప్రసాద్‌తో ఆమెకు వివాహమైంది. వీరికి 2013లో పెద్ద కుమారుడు, 2015లో మరో కుమారుడు జన్మించారు.
ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ.. పుష్పలతను సైతం సుప్రియ మాదిరి గృహ నిర్బంధానికే అత్తింటివారు పరిమితం చేశారు. ఇంట్లో పనులకే వినియోగించేవారు. బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టి కుక్కకు పెట్టినట్లు ఒక ప్లేటులో ఆహారం పెట్టేవారని పుష్పలత చెబుతోంది. తన తల్లిదండ్రులకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతోనే చాలా కాలం మౌనంగా భరించానని తెలిపింది. పెద్ద కుమారుడితోనే తనను పిన్ని అని పిలిపించేవారని వాపోయింది. తన కన్నకొడుకుని ఏనాడూ దగ్గరకు రానిచ్చేవారు కాదని చెప్పింది. అప్పట్లో ఏడాది వయస్సున్న చిన్న కుమారుడికి ఆరోగ్యం బాగోలేకపోతే కనీసం తనకు చూపించలేదని, అడిగితే.. ‘చచ్చిపోతే చచ్చిపోనీయ్!’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని కన్నీరు పెట్టుకుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పెద్ద కుమారుడిని విడిచిపెట్టి, 2016లో చిన్నకుమారుడిని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటపడ్డానని వివరించింది.
పెద్ద కుమారుడికి కనీసం అమ్మగా కూడా తాను తెలియనని కన్నీటిపర్యంతమైంది. ఇన్నాళ్లూ తోడికోడలు సుప్రియ ఉందనే భరోసాతో కుమారుడిని విడిచిపెట్టానని తెలిపింది. ఇప్పుడు ఆమె కూడా లేకపోతే తన కుమారుడికి రక్షణ ఉండదని వాపోయింది. భర్త, అత్తింటివారి ఆగడాలపై గతంలోనే పోలీసులకు, గృహహింస విభాగ సిబ్బందికి కూడా ఫిర్యాదులు చేశానని తెలిపింది.పెద్ద కోడలుతోపాటు.. చిన్న కోడలినీ గృహనిర్బంధంలో ఉంచడం.. వరుసగా ఈ ఘటనలు వెలుగులోకి రావడం విజయనగరంలో చర్చనీయాంశంగా మారింది. అసలు గోదావరి మధుసూదనరావు, దుర్గాప్రసాద్, వారి తల్లి ప్రవర్తనపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు వారెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో.. మున్ముందు వీరి కుటుంబం కోసం ఎలాంటివి వినాల్సి వస్తుందోనని చర్చించుకుంటున్నారు.