Crime News: బాపట్ల జిల్లాలో దారుణం - మైనర్‌పై సామూహిక అత్యాచారం, పోక్సో కేసు నమోదు
Andhrapradesh News: ఓ మైనర్‌పై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Minor Molested By Youth In Bapatla District: బాపట్ల (Bapatla) జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్‌పై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపట్నం మండలంలో 16 ఏళ్ల బాలికపై యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. వేమూరు మండలానికి చెందిన బాలిక.. శుక్రవారం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి బాలికను గ్రామ శివారులోని తోటల్లోకి తీసుకెళ్లిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా బాలిక స్వగ్రామానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరితో కొద్ది రోజుల క్రితమే బాలికకు పరిచయం ఏర్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నెల 28న రాత్రి బాలికను ఈ ఇద్దరు స్నేహితులతో పాటు మరో ముగ్గురు కూడా కలిశారు. అనంతరం తోటల్లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు.
పోక్సో కేసు నమోదు
బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ రోజు రాత్రి 10 గంటల తర్వాత బాలిక ఇంటికి రావడంతో ఆమె మేనమామ ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై బాలిక బంధువులు అడవుల దీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరు మైనర్‌గా గుర్తించిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే దారుణం
కాగా, బాపట్ల జిల్లాలో ఇటీవలే ఓ యువతిని దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 21న చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన యువతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో దుండగులు ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. రైల్వే ట్రాక్ సమీపంలో ముళ్ల పొదల్లో యువతి మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. పోలీస్ జాగిలాలతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం ఆదేశాల మేరకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కును వారికి అందించారు. అటు, ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. 10 ప్రత్యేక బృందాలతో నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. మద్యం మత్తులో నిందితులు యువతిని అత్యాచారం చేసి హత్య చేశారని.. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.