Mancherial Couple Murder: పాతకక్షలతో దంపతుల దారుణ హత్య, అసలేం జరిగిందంటే?
Mancherial Couple Murder: పాతకక్షలు మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి.. భార్యాభర్తలను అంతం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి వారి ఇంటికి వెళ్లి కర్రతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టి వారిని చంపేశాడు.
Mancherial Couple Murder: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. పాత కక్షలను మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి.. రెండు నిండు ప్రాణాలను బలిదీశాడు. భార్యా భర్తలిద్దరినీ కర్రలతో కొట్టి మరీ చంపేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన జినుక లచ్చన్న(55), జినుక రాజేశ్వరి (53)లకు అదే గ్రామానికి చెందిన గూడ సతీష్ తో గతం నుంచి గొడవలు ఉన్నాయి. వీరు తరచుగా గడొవలు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ సతీష్ ను రెండు రోజుల కిందట దూషించారు. దీంతో వీరిపై పగ పెంచుకున్న సతీష్.. దంపతులిద్దరినీ చంపేయాలనుకున్నాడు. ఇందుకు పథకం వేశాడు. మంగళవారం అర్ధరాత్రి కర్ర తీసుకొని వారి ఇంటి మీదకు వెళ్లాడు. ఇద్దరిపై కర్రతో ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసి హత్య చేశాడు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు అక్కడకు వెళ్లే సరికే భార్యా భర్తలిద్దరూ చనిపోయి ఉన్నారు. పక్కనే సతీష్ కర్ర పట్టుకొని ఉండడం చూసి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సీఐ కరిముల్లా ఖాన్, ఎస్ఐ సతీష్... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సతీష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కన్నతండ్రిని హత్య చేసిన కుమారుడు..
హైదరాబాద్ లోని ఉప్పల్ లో కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రిని కన్న కొడుకే కొట్టి చంపాడు. రోకలి బండతో మోది తండ్రి ప్రాణాలు తీశాడు. తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి ఇంట్లో అందర్నీ వేధిస్తున్నాడనే కారణంతో తండ్రిని రోకలి బండతో మోది హత్య చేశాడు. ఉప్పల్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అజ్మత్ నగర్‌లో లాకు గణపతి అనే 50 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమారులుతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారులు అభిషేక్, విశాంత్. గణపతి డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. చాలా ఏళ్ల క్రితమే గణపతి మద్యానికి బానిస అయ్యాడు. బాగా తాగి ఇంటికి రావడమే కాకుండా మద్యం మత్తులో తరచూ భార్యాపిల్లలతో గొడవ పడుతూ ఉండేవాడు. ఆ వేధింపులు భరించ లేక గణపతి భార్య ఇటీవల విషం తాగింది.
కుటుంబ సభ్యులు ఎలాగొలా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎలాగొలా ఆమెను బతికించుకున్నా కానీ, గణపతి తాగి ఇంటికి రావడం మానలేదు. ఈ విషయంపై శనివారం రాత్రి గణపతికి, చిన్న కుమారుడు అభిషేక్ అనే 22 ఏళ్ల యువకుడికి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో అభిషేక్ తన తండ్రి తలపై రోకలి బండతో బాదాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారి సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.