Nizamabad News: రోజు రోజుకీ పెరిగిపోతున్న లక్కీ డ్రా మోసాలు, అమాయకులే వాళ్ల టార్గెట్
అమాయకుల గాలెం. అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. కార్లు, బైక్ లు, టీవీలు, గృహోపకరణాల ఆశ చూపుతున్నారు. నెల నెల డబ్బులు వసూల్ చేస్తున్నారు. చివరికి టోకరా వేసి ఉడాయిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో లక్కీ డ్రా మోసాలు పెరిగిపోతున్నాయ్. అమాయకుల వీక్ నెస్ అసరా చేసుకుని కోట్ల రూపాయలు వసూల్ చేస్తూ ఉడాయిస్తున్నారు. పెట్టుబడి లేకుండా ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు ముఠాగా ఏర్పడి లక్కీ డ్రా స్కీంల పేరిట దోచేస్తున్నారు. ఆకర్షణీయమైన బహుమతులంటూ ఆశ చూపిస్తున్నారు. మొదట్లో ఒకరిద్దరికి బహుమతులు ఇస్తారు. ఆశ పడిన మిగతా వారు డబ్బులు నెలనెలా కడతారు. మొత్తం డబ్బులు వసూలు అయ్యాక ఎలాంటి బహుమతులు ఇవ్వకుండా ఊడాయిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఇది ఓ బిజినెస్ గా మారిపోయింది.
కార్లు, బైక్లు, రిఫ్రీజ‌్‌రేటర్లు, టీవీలు, గృహోపకరణాలు ఇస్తామంటూ సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు. బహుమతుల పేరుతో ఊరిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి నెల నెల రూ.1500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తారు. మొదట డ్రా తీసి ఒక్కరికో ఇద్దరికో బహుమతులు ఇస్తారు. తర్వాత చిన్నా చితకా బహుమతులు పంచిపెడతారు. చివరి వరకు ఎలాంటి బహుమతులు రాని వారికి వారు కట్టిన డబ్బుకంటే కొంత అదనంగా చెల్లిస్తామని చెబుతారు.
దాదాపు 2 నుంచి 3 వేల మంది వరకు ఒక్కో డ్రా స్కీంలో సభ్యులను చేర్పిస్తారు. ఇలా చివరి వరకూ దాదాపు 4 నుంచి 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తారు. డబ్బు మొత్తం వసూలు కాగానే బిచాణా ఎత్తేస్తారు. ఇలా రోజుకో లక్కీ డ్రా స్కీంల మోసాలు నిజామాబాద్‌లో వెలుగు చూస్తూనే ఉన్నాయి.
ఏబీపీ దేశం వద్ద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓ లక్కీ డ్రా స్కీంలో 3 వేల మంది మోసపోయారు. ఈ విషయాన్ని ప్రజావాణిలో గత నెల 10న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులంతా లబోదిబోమని మొత్తుకున్నా ఇంతవరకూ వారికి ఎలాంటి న్యాయం జరగలేదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 నుంచి 15 లక్కీ డ్రా స్కీంలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ స్కీంలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇలాంటి స్కీంలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ స్కీంల నిర్వాహకులకు పరోక్షంగా పోలీసులు కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్.
బాధితులు కొంత మంది తమ గోడు వెళ్లబోసుకుంటే తప్ప ఈ దందా గుట్టు బయటికి రావట్లేదు. గత నెల 10న దాదాపు 100 మంది కలెక్టరేట్ కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. చిన్న చిన్న పనులు చేసుకునే వారే ఎక్కువగా ఈ స్కీంలకు ఆకర్షితులవుతున్నారు. రోజు వారి కూలీలు కొంత డబ్బును పోగు చేసుకుని లక్కీ డ్రా స్కీంలకు కడితే చివరికి వారు ఉడాయిస్తున్నారు. దీంతో వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో మరో లక్కీ డ్రాం స్కీం బాగోతం బయటపడింది. గతంలో మోసపోయిన బోధన్ కు చెందిన ఓ వ్యక్తి ఎడపల్లిలో ఈ దందా కొనసాగుతున్న విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై లక్కీ డ్రా నిర్వహకులు దాడి చేశారు. గాయపడిన సదరు వ్యక్తి పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరా తీసిన పోలీసులు శ్రీసాయి గ్రూప్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని తెలిపారు. కానీ పోలీసులు మాత్రం ముందస్తుగా ఈ లక్కీ డ్రాం స్కీంపైన దృష్టి సారించటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయ్. పోలీసులు సహకరించటం వల్లే వీరు ఇలా మోసాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఇకనైనా వీరి ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు బాధితులు.