Lakhimpur Horror: చెట్టుకు వేలాడుతూ ఇద్దరు బాలికల మృతదేహాలు, అత్యాచారం చేశారని తల్లి ఆరోపణలు
యూపీలో దారుణం జరిగింది. లఖింపూర్ ఖేరిలో సొంత అక్కాచెల్లెళ్లు ఒకేసారి, అది కూడా దారుణమైన స్థితిలో చనిపోయి కనిపించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Two Dalit Girls, Sisters, Found Hanging From Tree: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. లఖింపూర్ ఖేరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సొంత అక్కాచెల్లెళ్లు ఒకేసారి, అది కూడా దారుణమైన స్థితిలో చనిపోయి కనిపించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నిందితులు తమ కూతుళ్లపై అత్యాచారం చేసి వారిని హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
లఖింపూర్ ఖేరిలో ఓ దళిత కుటుంబం నివాసం ఉంటోంది. అయితే కొందరు గుర్తుతెలియనివ్యక్తులు బైకులపై వచ్చి తమ కూతుళ్లను కిడ్నాప్ చేశారని తల్లి చెప్పారు. కిడ్నాప్ అయిన తమ కూతుళ్లు బుధవారం మధ్యాహ్నం చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా వేలాడుతూ కనిపించారంటూ బాలికల తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. తన కూతుళ్లు ఇద్దరు మైనర్లని, వారిని కిడ్నాప్ చేసిన నిందితులు అత్యాచారం చేసి హత్య చేసి ఇలా చెట్టుకు వేలాడదీశారని ఆమె ఆరోపించారు.
UP | Bodies of two sisters found hanging on a tree at some distance from their house in Lakhimpur. SP is present on the spot. A case will be registered on the basis of the complaint received from their family. Every aspect will be examined: UP ADG (L&O) Prashant Kumar
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 14, 2022
(File Pic) pic.twitter.com/S8ZopU9oVu
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. లక్నో రేంజ్ ఐజీ లక్ష్మీసింగ్‌ను సంఘటనా స్థలానికి పంపినట్లు లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. బాలికల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు నిఘాసన్ పోలీసులు. వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించి పోలీసులకు నివేదిక అందించనుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఫైర్
దళిత బాలికలు అలా హత్యకు గురై చెట్టుకు విగతజీవులుగా వేలాడుతూ కనిపించిన ఘటనపై ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దళిత సోదరీమణులను కిడ్నాప్ చేసి, హత్య చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు ఎస్పీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. లఖింపూర్‌లో గతంలో రైతుల దుర్ఘటన జరిగిన తర్వాత, ఇప్పుడు దళితులను చంపేశారని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో ఈ దారుణంపై స్పందించారు. లఖింపూర్ లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను చంపిన ఘటన హృదయ విదారకంగా ఉందన్నారు ప్రియాంక గాంధీ. ఆ బాలికలను పట్టపగలు కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు చెప్పారని, దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని ప్రియాంక ఆరోపించారు. గత ప్రభుత్వాలతో పోల్చితే యూపీలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు.