Journalist Murder: నంద్యాలలో విలేకరి దారుణ హత్య.. ఓ వీడియో కారణంగా కానిస్టేబుల్ ఘాతుకం.. డీజీపీ సీరియస్
మట్కా గుట్టు రట్టుచేసినందుకు ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరిని మట్టుపెట్టాడో కానిస్టేబుల్. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన దారుణ ఘటనపై డీజీపీ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఓ విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరిగా పనిచేస్తున్న కేశవ్ (32)ను ఆదివారం రాత్రి హత్య చేశారు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం నంద్యాల ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న కేశవ్, అతని సహ ఉద్యోగి ప్రతాప్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. టూటౌన్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్, అతడి సోదరుడు కేశవ్ బైక్ ఆపారు. మాట్లాడాలని పక్కకు పిలిచి కానిస్టేబుల్ తమ్ముడు ఒక్కసారిగా కేశవ్ పై దాడిచేశాడు. స్క్రూ డ్రైవర్‌తో కేశవ్ ను ఎనిమిది సార్లు పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన కేశవ్ ను ప్రతాప్ ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే విలేకరి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మట్కా వ్యవహారంలో సోషల్ మీడియాలో ఇటీవల ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ సంఘటకు సంబంధించి కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. దీంతో కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కేశవ్ భార్య వాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిన్న అర్ధరాత్రి నంద్యాల వచ్చిన కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితుడి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేశవ్‌ను కానిస్టేబుల్ సుబ్బయ్య హత్య చేశాడని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎస్పీకి వాగ్మూలం ఇచ్చారు. కేశవ్ హత్య కేసుకు సంబంధించి కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని సోదరుడు నానిలపై హత్య కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేకంగా రెండు బృందాలు గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కానిస్టేబుల్, అతని సోదరుడే హత్య చేశారని విలేకరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, దర్యాప్తులో ఈ విషయాలు తెలిశాయని ఎస్పీ అన్నారు. జర్నలిస్ట్ కేశవ్ దారుణ హత్యపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ఘటను తీవ్రంగా ఖండించాయి. ఇవాళ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హత్యకు కారణమైన కానిస్టేబుల్, అతని సోదరుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జర్నలిస్ట్ హత్యపై డీజీపీ సీరియస్
నంద్యాలలో జర్నలిస్ట్ కేశవ్ హత్య ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. విలేకరి హత్య కేసును సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీని డీజీపీ ఆదేశించారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్‌తో పాటు జర్నలిస్ట్ కేశవ్ హత్యతో సంబంధం ఉన్న వారందరిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. మట్కా మాఫియా అరాచకాలను బయటపెట్టారన్న కారణంతో విలేకరిని హత్య చేసినట్లు తెలుస్తోంది.