(Source: ECI/ABP News/ABP Majha)
Konaseema Road Accident: కోనసీమ జిల్లాలో లారీని ఢీకొట్టిన బైక్ - ఇద్దరు విద్యార్థులు మృతి
Konaseema Road Accident: కోనసీమ జిల్లాలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు కారను తప్పించబోయి లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
Konaseema Road Accident: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు కారును తప్పించబోయి లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం వద్ద ఆదివారం రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామానికి చెందిన యన్.నారేంద్ర కాగా మరొకరు అంబాజీపేట మండలం ముక్కామల గ్రామానికి కుచెందిన యన్.రాజేష్ గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ అమలాపురం శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులుగా గుర్తించారు.
రెండ్రోజుల క్రితం అనకాపల్లిలో ప్రమాదం - ఒకరు మృతి
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్తోన్న ఆర్టీసీ బస్సును అదే మార్గంలో వెళ్తోన్న పంజాబ్ కు చెందిన లారీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఆ బస్సు ముందున్న ఆటో ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విశాఖపట్నం ఇసుకతోటకు చెందిన మడపల్లి వీరయ్య (50) మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 48 మంది ప్రయాణికులలో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్.ఐ ప్రసాదరావు క్షతగ్రాతులకు సాయం అందించారు. గాయపడిన వారిని 108లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం నక్కపల్లి ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్.రాయవరం పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ తరలించారు.
పార్వతీపురంలో కూడా..
పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమరాడ దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టిన దుర్ఘటనలో ఐదుగురు చనిపోయారు. వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులంతా అంటివలసకు చెందినవారిగా గుర్తించారు. అంతా ఒక ఊరి వారే.. సమీపంలోనే శుభకార్యానికని వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేసి స్వగ్రామానికి ఆటోలో తిరిగి పయనమయ్యారు. విందు ముచ్చట్లు చెప్పుకొంటూ సరదాగా గడిపారు. మరి కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటారు. ఇంతలోనే ఉలికిపాటు.. రెప్ప మూసి తెరిచేలోపే నెత్తురు కారుతున్న చేతులు.. ముద్దయిన శరీర భాగాలు.. హాహాకారాలు.. అప్పటి వరకూ తమతోపాటు కబుర్లు చెబుతున్న వారే.. కళ్లెదురుగా విగతజీవులై పడి ఉన్నారు. ఆటో లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు దుర్మరణం పాలైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపథం వద్ద చోటుచేసుకుంది.
కొమరాడ మండలం అంటివలస గ్రామానికి చెందిన పలువురు ఆటోలో కూనేరు సమీపంలోని తుమ్మలవలస గ్రామానికి పెళ్లి భోజనాల నిమిత్తం బుధవారం వెళ్లారు. మధ్యాహ్నం భోజనం ముగించుకుని తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో చోళపథం శివాలయం సమీపంలో మలుపు వద్ద పార్వతీపురం నుంచి రాయగడ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఆ సమయంలో ఆటోలో మొత్తం 13 మంది ఉన్నట్లు సమాచారం. ఆటో తిరగబడి అందులో ఉన్న ఊయక నరసమ్మ(40, మెల్లక శారద(35), ఊయక లక్ష్మి(42), మెల్లక అమ్మడమ్మ(40) చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రహదారి మొత్తం రక్తసిక్తమైంది. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఊయక వెంకటి మృతి చెందాడు. ఆటో డ్రైవర్ ఊయక వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉంది.