Konaseema News : కోనసీమలో అమానుష ఘటన, దళిత యువకుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లి దాడి
Konaseema News : కోనసీమ జిల్లాలో ఓ దళిత యువకుడిపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ లాక్కెళ్లడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Konaseema News : డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంలో ఓ దళిత యువకుడ్ని బండితో రోడ్డుపై శరీరం కొట్టుకుపోయేలాగా ఈడ్చుకెళ్లిన సంఘటన జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరన్న మెరక గ్రామానికి చెందిన దళిత యువకుడు ఉప్పే రమేష్ అల్లవరం నుంచి ఎంట్రుకోన వెళ్లే రోడ్డు పక్కన నిలబడి ఉండగా అల్లవరం మండలం ఎంట్రుకోన గ్రామానికి చెందిన మోటూరి ఉదయ్, ఈటి సాయి ప్రకాష్ అనే యువకులు మోటార్ సైకిల్ పై స్పీడుగా డ్రైవింగ్ చేసుకుంటూ రమేష్ మీదకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఇదేం దౌర్జన్యం అని వారిద్దరిని రమేష్ ప్రశ్నించాడు. రమేష్ మమ్మల్ని ప్రశ్నించడం ఏంటని సహించని ఉదయ్, సాయి రమేష్ పై దౌర్జన్యం చేయబోయారు కానీ పట్టపగలు నడిరోడ్డు కావడంతో రమేష్ ను అసభ్య పదజాలంతో బూతులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు.
పార్టీ ఉందని పిలిచి దాడి
రమేష్ కు సన్నిహితుడు పల్లేటి శ్రీను సాయంత్రం పార్టీ ఉందని చెప్పి రమేష్ ను మోటార్ సైకిల్ ఎక్కించుకుని అల్లవరం మండలం బుడంపేట స్మశాన వాటిక దగ్గరకు తీసుకు వెళ్లాడు. నువ్వు ఇక్కడే ఉండు నేను తినడానికి ఫ్రైడ్ రైస్ తెస్తానని చెప్పి శ్రీను వెళ్లిపోయాడు. మధ్యాహ్నం రమేష్ పై దౌర్జన్యం చేసిన ఇద్దరు యువకులతో కలిసి కుట్ర చేసిన శ్రీను రమేష్ ఒక్కడే స్మశాన వాటిక దగ్గర ఉన్నాడని ఉదయ్, సాయిలకు సమాచారం అందజేశాడు. స్మశాన వాటికకు కూతవేటు దూరంలో ఉన్న ఇద్దరు యువకులు వెంటనే మోటార్ సైకిల్ పై రమేష్ వద్దకు చేరుకొని విచక్షణారహితంగా దాడి చేశారు. కింద పడేసి కొట్టారని బాధితుడు రమేష్ వాపోయాడు. తరువాత ఉదయ్ మోటార్ సైకిల్ నడుపుతుండగా ఈటి సాయి ప్రకాష్ వెనకాల కూర్చుని కింద పడి ఉన్న రమేష్ చేయి పట్టుకుని ఉద్దేశపూర్వకంగా నడిరోడ్డుపై చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్లారు. తనను వదిలిపెట్టాలని వేడుకున్నా వదల్లేదని, గింజుకోవడంతో మురికి కాలువలో పడిపోయానని రమేష్ తెలిపారు. కాలువ అవతల ఉన్న ఒక ఇంటిలోకి వెళ్లి భయంతో దాకున్నానని, మరల ఇద్దరు యువకులు రమేష్ దాకున్న ఇంటిలోనికి వెళ్లి బయటకు లాక్కొచ్చి జుట్టు పట్టుకుని దాడి చేయబోయారని అయితే చుట్టుపక్కల వారు ఇళ్లల్లోంచి బయటకు రావడంతో అక్కడ నుంచి పారిపోయారని రమేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు రమేష్ తీవ్రంగా గాయపడగా శరీరం పలు చోట్ల దారుణంగా కొట్టుకుపోయింది.
దళిత, ప్రజాసంఘాల నిరసన
దళిత యువకుడిపై అత్యంత అమానుషంగా దాడి చేసి గాయపరిచిన ఇద్దరు యువకులను వారికి సహకరించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. బాధితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వెళ్లి అక్కడ తమ నిరసనను తెలిపారు. దళిత యువకుడిని కొట్టిన కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు యువకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు అల్లవరం ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు.