Konaseema Crime : అమ్మ మాటకు కట్టుబడి దొంగతనాలు, తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్!
Konaseema Crime : మాటలు రాని కొడుకుతో ఓ తల్లి చేయించిన పనేంటో తెలిస్తే షాక్ తింటారు. బదిరుడైన కొడుకుతో తల్లి చోరీలు చేయించింది.
Konaseema Crime : అమ్మంటే కొడుకుకు నాలుగు మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే మాతృ మూర్తిగా చెబుతుంటారు. అయితే ఓ తల్లి మాత్రం మాటలు రాని కొడుకుతో దొంగతనాలు చేయిస్తూ ఆ పదానికి సరికొత్త భాష్యం చెప్పింది. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ తిలక్ తెలిపిన వివరాలు ప్రకారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు నాగులపేటకు చెందిన వజ్రపు నాగబాబు (శేషు)కు పెద్దగా మాటలు రావు. మూగ లక్షణాలతో ఉన్న కొడుకును అడ్డుపెట్టుకుని తల్లి నాగలక్ష్మి నేరాలకు పాల్పడ్డారు.
తాళం వేసిన ఇళ్లలో చోరీలు
వలస కూలీలైన వీరు చాలా కాలం క్రితం నాగులపేటకు వచ్చి స్థిరపడ్డారు. అయితే ఈ ప్రాంతంలో ఇంటిల్లిపాదీ ఉదయాన్నే ఇంటికి తాళం వేసుకుని నర్సరీ పనులకు వెళ్లిపోతారు. ఇలా తాళం వేసి ఉన్న గృహాలను గుర్తించి మాటలు రాని కొడుకు చేత దొంగతనాలు చేయించేది తల్లి నాగలక్ష్మి. నాగులపేటకే చెందిన నాగలక్ష్మి సోదరుడు బంటు రాంబాబు ముందుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లు గుర్తించి నాగలక్ష్మికి చెప్పేవాడు. ఆ తర్వాత తల్లి తన కుమారుడు శేషుని ఆ ఇంట్లోకి పంపించి నగదు, బంగారం, వెండి వస్తువులను దొంగతనాలకు పాల్పడేవారు. మాటలు రావని అందరూ జాలిగా చూసే శేషు ఇటువంటి దొంగతనాలకు పాల్పడటం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
పలు గ్రామాల్లో దొంగతనాలు
నాగులపేటలో మూడు ఇళ్లల్లో చోరీ చేయగా కడియం మండలం పొట్టిలంక, వీరవరం గ్రామాలలో మరో రెండు ఇళ్లల్లో ఇటువంటి దొంగతనాలకే పాల్పడ్డారు. ఎట్టకేలకు పట్టుబడ్డ వీరిని విచారించగా ఈ నేరాలన్నీ బయటపడినట్లు సీఐ తిలక్ ఆదివారం వివరించారు. వీరి వద్ద నుంచి రూ.1.41 లక్షల నగదు, 44.680 గ్రాముల బంగారం, 351 గ్రాముల వెండి వస్తువులు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అరెస్టు అయిన ఈ ముగ్గురిని కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐలు పి.శ్రీనివాసరావు, బాలాజీ, కానిస్టేబుల్స్ కె.సురేష్ కుమార్, సీహెచ్. సత్యనారాయణ, వి.ఎల్.జి భవానిలను సీఐ అభినందించారు.
బిగ్ సి షాపులో చోరీ
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణంలోని బిగ్‌సి సెల్ ఫోన్ షాప్‌లో దుండగులు చోరీకి తెగబడ్డారు. గడ్డపలుగుతో షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. దుకాణంలో విలువైన సెల్‌ఫోన్లు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. తిరువూరు నడిబొడ్డున చోరీ జరగడంపై వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసు నిఘా మరింత పటిష్టం చేయాలని వ్యాపారస్తులు, ప్రజలు కోరుతున్నారు.
Also Read : Guntur Crime : రెండు సార్లు రెక్కీ, పక్కా ప్లాన్ తో- గుంటూరులో రౌడీ షీటర్ దారుణ హత్య!