Guntur Crime : రెండు సార్లు రెక్కీ, పక్కా ప్లాన్ తో- గుంటూరులో రౌడీ షీటర్ దారుణ హత్య!
Guntur Crime : గుంటూరులో రౌడీ షీటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సంచలనంగా మారిన ఈ కేసులో సీఐపై వేటు పడింది.
Guntur Crime : గుంటూరు నగరం ఏటుకూరు రోడ్డులో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితుల అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై గుంటూరు రేంజ్ ఐజీ వేటు వేశారు. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు రోడ్డులో ఈ నెల 18న రమేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును లాలాపేట పోలీసులు అతి కష్టం మీద ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 2 వేట కొడవళ్లు, 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి కేసును ఛేదించారు. హత్యకు గురైన రమేష్ పై రౌడీషీట్ కూడా ఉండటంతో పోలీసులు కేసును సవాల్ గా తీసుకున్నారు.
స్నేహం వైరంగా మారి
సంపత్ నగర్ కి చెందిన భార్గవ్ కృష్ణ, రమేష్ ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య ఆధిపత్యం పెరిగింది. దందాలు సాగించి వచ్చిన దాంట్లో వాటాలు పంచుకునే విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. రమేష్ స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఆర్థికంగా స్థిరపడినప్పటికీ భార్గవ్ కృష్ణతో కలసి దందాలు సాగిస్తూనే ఉన్నాడు. రమేష్ ఉంటే దందాలు సాగించటం కష్టంగా భావించిన భార్గవ్ కృష్ణ అతడి హత్యకు ప్లాన్ వేశాడు. ఈ మేరకు రెండు సార్లు రెక్కీ కూడా నిర్వహించాడు. మూడోసారి పక్కాగా ప్లాన్ అమలు చేయాలని ప్రయత్నించినా రమేష్ తప్పించుకున్నాడు. దీంతో ప్లాన్ మార్చిన భార్గవ్ కృష్ణ, నల్లచెరువు ప్రాంతానికి చెందిన సులేమాన్, రబ్బాని, ఆరీఫ్, బాషాలతో కలిసి రమేష్ ని హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. అయితే ఈ సారి ప్లాన్ మాత్రం పక్కాగా అమలు అయ్యింది. వేట కొడవళ్లతో రమేష్ ను అతికిరాతకంగా నరికి హత్య చేశారు.
(రమేష్)
రమేష్ భార్య సమాచారంతో
ఈ ఘటన గుంటూరు నగరంలో తీవ్ర కలకలం రేపింది. రౌడీషీటర్ గా ఉన్న వ్యక్తి హత్యకు గురికావటంతో పోలీసులు సైతం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. హత్యకు గురైన రమేష్ భార్య ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే రమేష్ భార్య ఫిర్యాదులో రామకృష్ణ, కలపాల ప్రతాప్, చకోడి సతీష్ ల పేర్లు కూడా ఉన్నాయి. దీంతో వారిపై పోలీసులు విచారణ చేపట్టారు. గుంటూరు నగరంలో రౌడీషీటర్లు హత్యకు గురికావటంతో మొదటిసారి కాదు. ఈ మధ్య కాలంలో పోలీసులు రౌడీషీటర్ల కదిలకలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. స్టేషన్ కు పిలిచి విచారణ చేస్తున్నారు. అయినా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూడటంపై పోలీసుల వైఫల్యాలను ఎత్తి చూపింది.
సీఐపై వేటు
ఈ కేసులో లాలాపేట సీఐపై గుంటూరు రేంజ్ ఐజీ చర్యలు తీసుకున్నారు. రౌడీషీటర్ల కదిలికలపై నిఘా పెట్టటంలో విఫలం కావటం, సంఘటనకు సంబంధించి ముందస్తుగా రౌడీషీటన్ల కదలికలపై సమాచారం ఉన్నా సరైన రీతిలో స్పందిచలేదని అధికారులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో సీఐ ప్రభాకర్ ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఆదేశాలు ఇచ్చారు.