Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు.
Karnataka Accident : కర్ణాటక బీదర్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు మృతిచెందారు. దేవదర్శనం కోసం వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కంటైనర్‌ను కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందతూ చనిపోయారు. మృతులు హైదరాబాద్ బేగంపేట వాసులుగా తెలుస్తోంది. మృతులు గిరిధర్ (45), ప్రియ (15), అనిత (30), మహేక్ (2), డ్రైవర్ జగదీష్ (35)గా సమాచారం. గాయపడిన గీత, రజిత, ప్రభావతి, షాలిని, హర్షవర్ధన స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గిరిధర్ కలబురగి జిల్లా గంగాపూర్‌కు చెందిన దత్తాత్రేయ స్వామి ఆలయానికి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది వెళ్లినట్లు సమాచారం. దైవ దర్శనానికి వెళ్లి ప్రమాదానికి గురికావడంపై మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
గుంటూరులో రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 16వ నెంబర్ జాతీయ రహదారి తుమ్మలపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న మొత్తం నలుగురు ఉండగా స్పాట్లో ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మహిళకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. గాయపడిన మహిళను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కారులో గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇంటి గోడ కూలి ఐదుగురు మృతి
ఛత్తీస్ గఢ్‌లోని కంకేర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. ఇంటి గోడ కూలి భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు మృతి చెదారు. ఐదుగురు మరణించినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. కాంకేర్ జిల్లాలోని పఖంజూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇర్పనార్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తుండగా సోమవారం తెల్లవారుజామున ఇంటి మట్టి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు పడవలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కంకేర్‌లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఈ ప్రాంతంలోని నదులు, వాగులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : Machilipatnam Crime News : మచిలీపట్నంలో దారుణం, పోలీసులమని బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం
Also Read : బస్సే అంబులెన్స్ అయింది, అందుకే వారికి అవార్డు వచ్చింది!