Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా?
Karimnagar Crime News: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి మరీ చంపేశారు.
![Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? Karimnagar Crime News Unknown Persons Brutally Murdered One Young Man in Karimnagar Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/8a7a5badfe36ff92fcb6d3f87aaec3451679494656601519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karimnagar Crime News: కరీంనగర్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి మరీ చంపేశారు. నగరంలోని విద్యానగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని పీటీసీ రోడ్డులో పురంశెట్టి నరేందర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మూతపడ్డ ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలోనే నరేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వానికి తరలించారు.
అంతకుముందు మృతుడు నరేందర్ తో పాటు మరికొంత మంది ఆ ప్రాంతంలో మద్యం సేవించినట్లు ఆనవాళ్లను గుర్తించారు. మద్యం సేవించిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. మృతుడు నరేందర్ సంతోష్ నగర్ నివాసి. అయితే ఇతడు కొద్దీ రోజులు ఆస్ట్రేలియాలో ఉండి ఇటీవల కరీంనగర్ వచ్చాడు.
పదిహేను రోజుల క్రితం మేనమామను చంపిన యువకుడు
మేనమామ భిక్షాటన చేస్తుండడం వల్లే తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని.. అతడిని హత్య చేశాడో యువకుడు. ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్ పక్కన మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. కానీ సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాలు నిందితులను పట్టించగా.. ప్రస్తుతం యువకుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.
అసలేం జరిగిందంటే..?
పెద్దపల్లి డీసీప వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈనెల 4వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ట్రాక్ కు కొద్ది దూరంలో మృతదేహం పడి ఉండడం సందేహాలకు తావు ఇచ్చింది. రైలు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయినా, దూకినా సమీపంలోనే పడిపోతాడని.. ట్రాక్ నుంచి 100 అడుగుల దూరంలో మృతదేహం ఉండడం, అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను గుర్తించారు. సెంటినరీ కాలనీలోని సీసీ ఫుటేజీలోనూ అదే ఆటోను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మంగళవారం పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో ఎస్సై రాజేశ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా... అదే ఆటో కనిపించడం, పోలీసులు చూసిన వెంటనే డ్రైవర్ ఆందోళన చెందడంతోపాటు అనుమానాస్పదంగా వ్యవహరించాడు. దీంతో అతడిని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
భిక్షాటన చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని..
రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన చిప్పగుర్తి శివ ఆటో డ్రరైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అతడి మేనమామ 50 ఏళ్ల మారుపాక రాయమల్లు స్థానికంగా చెప్పులు కుట్టడంతోపాటు భిక్షాటన చేసేవాడు. కాగా శివకు పెళ్లి సంబంధాలు రావడం లేదు. మేనమామ భిక్షాటన చేస్తుండడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని భావించిన శివరాం అతడి హత్యకు పథకం రచించాడు. ఈనెల 3వ తేదీన సెంటినరీ కాలనీలోనే రాయమల్లుపై దాడి చేసి ఆటోలో పెద్దపల్లికి తీసుకువచ్చారు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో సమీపంలోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లి కర్రతో రాయమల్లు తల, ఇతర శరీర భాగాలపై మరోసారి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని శివ ట్రాక్ పక్కన పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అంతరం చేపట్టిన విచారమలో హత్యగా గుర్తించి, నిందితుడు శివను అరెస్టు చేశారు. సమావేశంలో ఏసీపీ మహేష్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేశ్ ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)